Begin typing your search above and press return to search.

కోక్ బాటిల్స్ పక్కకు తోసేసిన రొనాల్డో .. రూ.30 వేల కోట్లు నష్టం !

By:  Tupaki Desk   |   16 Jun 2021 6:30 AM GMT
కోక్ బాటిల్స్ పక్కకు తోసేసిన రొనాల్డో .. రూ.30 వేల కోట్లు నష్టం !
X
క్రిస్టియానో రొనాల్డో .. ఈ పేరు కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.క్రిస్టియానో రొనాల్డో పోర్చుగ‌ల్ స్టార్ సాకర్ దిగ్గజం. అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు… ప్రస్తుతం యూరో చాంపియ‌న్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటున్నాడు. యూరో కప్ 2021లో భాగంగా మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్, హంగేరీ మధ్య గ్రూప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశానికి వచ్చి కూర్చున్న రొనాల్డో, టేబుల్ మీద కోకాకోలా బాటిల్స్ ఉండటం గమనించాడు. వెంటనే వాటిని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టేశాడు.

ఆ తర్వాత వెంట‌నే అత‌డే అస‌లు విష‌యాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సాఫ్ట్ డ్రింక్‌కు బ‌దులుగా నీళ్లు తాగండి అంటూ అక్క‌డే ఉన్న వాట‌ర్ బాటిల్‌ ను చేతికి తీసుకుని పైకెత్తి చూపించాడు. ఇలా చేయడంతో అక్కడే ఉన్న మీడియాతోపాటు కంపెనీ ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచ స్థాయికి ఎదుగిన రొనాల్డో ఫిట్‌నెస్‌ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. ఇందులోభాగంగా ఆయన జంక్‌ ఫుడ్స్‌ కు పూర్తిగా దూరంగా ఉంటాడని ప్రచారం. యూరో క‌ప్ అనే కాదు కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్‌ కు డ్రింక్ కంపెనీలే స్పాన్స‌ర్ చేస్తుంటాయి. వాటిని ప్లేయ‌ర్స్ మీడియా స‌మావేశాల్లోనూ ప్ర‌దర్శించాల‌నుకుంటాయి. కానీ రొనాల్డో లాంటి స్టార్ ప్లేయ‌రే ప‌బ్లిగ్గా ఇలా తాగొద్దని ప్రకటన చేయడంతో ఆ కంపెనీలకు షాక్ తగిలినంత పనైంది. క్రిస్టియానో రొనాల్డో చేసిన ఆ చిన్న పని కోకాకోలా కంపెనీ కి రూ. 30 వేల కోట్ల నష్టాన్ని తెచ్చింది. రొనాల్డో, టేబుల్ మీద కోకాకోలా బాటిల్స్ ను పక్కన పెట్టేయడంతో కోకాకోలా కంపెనీ షేర్స్ నష్టాన్ని చవిచూశాయి.

గత ఏడాది 'ఈఎస్‌పీఎన్' రొనాల్డో తినే తిండి, నిద్రకు సంబంధించి ఒక కథనాన్ని వెలువరించింది. దాని ప్రకారం రొనాల్డో రోజుకు 6 సార్లు భోజనం చేస్తాడు. అంతే కాకుండా రోజుకు 5 సార్లు 90 నిమిషాల చొప్పున పడుకుంటాడు. ప్రతీ రోజు ఉదయాన్నే హామ్, చీజ్‌తో పాటు యోగర్డ్‌ను బ్రేక్ ఫాస్ట్‌ గా తీసుకుంటాడు. ఆ తర్వాత ఆకలైతే అవకాడో టోస్ట్‌ను తింటాడు. ప్రతీ రోజు రెండు లంచ్‌లు, రెండు డిన్నర్‌లు చేస్తాడని ఆ కథనంలో పేర్కొన్నారు. బయట ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోడు. అంతే కాకుండా కార్బొనేటెడ్ డ్రింక్స్‌ కు పూర్తిగా దూరంగా ఉంటాడు. ఆకలైతే ఫ్రూట్స్ తప్ప భారీగా భోజనం చేయడు. ప్రతీ భోజనం తర్వాత కాసేపు నడక.. ఆ తర్వాత నిద్ర.. ఇలా కఠినమైన డైట్ ఫాలో అవుతుంటాడు. యూరో కప్ 2020లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0 తేడాతో హంగేరీపై విజయం సాధించింది.