Begin typing your search above and press return to search.

బడ్జెట్ రోశయ్య

By:  Tupaki Desk   |   4 Dec 2021 11:18 AM GMT
బడ్జెట్ రోశయ్య
X
కొణిజేటి రోశయ్య.. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయనది చెరగని రికార్డు. ఏకంగా 15 సార్లు శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉంటూనే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

అంతేకాక, వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన నేత. 1989లో తొలిసారి ఆర్థిక మంత్రి అయిన రోశయ్య 2009-10వరకు (కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో) బడ్జెట్ తీసుకొచ్చారు.

వైఎస్ సక్సెస్ లో రోశయ్య

2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సహజంగానే రోశయ్య ఆర్థిక మంత్రి అయ్యారు. అప్పటికి పదేళ్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడం.. కరువు ప్రభావం.. వైఎస్ ఇచ్చిన హామీలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా రోశయ్య ఎలా నెట్టుకొస్తారో అనే అనుమానం నెలకొంది. సీఎంగా వైఎస్ కూ కీలక సమయం అది.

అప్పట్లో కనుక విఫలవమైతే ఫలితం వేరేలా ఉండేది. కానీ, రోశయ్య అసాధారణ ఆర్థిక చతురత వైఎస్ సర్కారును నిలబెట్టింది. రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ఠను అమాంతం పెంచింది.

డబ్బు ఎక్కడినుంచి తెస్తున్నారో?

కొత్త పథకాలు ప్రవేశపెడుతూ పోతూ వైఎస్.. ఆర్థిక భారాన్నంతా రోశయ్య మీదనే వేసేవారు. ఇక అక్కడ్నుంచి రోశయ్య కష్టాలు రోశయ్యవి.
కొత్త పన్నులు వేయకుండా.. ఆదాయం తగ్గకుండా చూసుకుంటూ ఆర్థిక రథాన్ని లాగించేవారు. ఇదంతా ఎలా సాధ్యమయ్యోదో ఎవరికీ తెలిసేది కాదు. ఓ దశలో ఇందులో ఏదో మర్మం ఉందని ప్రతిపక్షాలు అనుకునేవి.

ఇక వైఎస్ ఎన్ని హామీలిచ్చినా.. రోశయ్య గొప్పగా ఆర్థిక సర్దుబాటు చేయడాన్ని అందరూ మెచ్చుకుంటుంటే.. ఆయన మాత్రం ముసిముసిగా లోలోన నవ్వుకునేవారు. ‘‘ఆయన (వైఎస్) చేతికి ఎముక లేనట్లు హామీలిస్తారు. వాటిని తీర్చేలా చూడడంలో నా తిప్పలు నావి’’ అని ఓ దశలో రోశయ్య అనడం గమనార్హం.

అన్నిట్లోనూ బడ్జెట్ మ్యానే

రోశయ్య అంటే గంభీరమైన మనిషి. వాగ్ధాటి గల వ్యక్తి . సమయానికి తగినట్లు పంచులు వేసే మనిషి. కానీ, ఆయన ఆహార్యం ఎంత సాధారణంగా ఉంటుందో అలానే ఆయన కూడా బడ్జెట్ మనిషి.

ఎక్కడా మాటలో కానీ, ప్రవర్తనలో కానీ ఆడంబంరం కనబడదు. అంత గుంభనంగా ఉంటారు. బడ్జెట్ ప్రవేశపెట్టడంలోనే కాదు.. బడ్జెట్ మనిషిగా మసులుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి. అందుకే మంత్రి అయినా, సీఎం అయినా, గవర్నర్ అయినా అమీర్ పేటలోని ఇంటిని వదల్లేదాయన..

కొసమెరుపు .. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్య 1998 ప్రాంతంలో ఖమ్మం పర్యటనకు వచ్చారు. ఆయనను పలుకరించేందుకు పది మంది నాయకులూ రాలేదు.

20 మంది కార్యకర్తలయినా కనిపించలేదు. అయినా రోశయ్య ఏమీ బాధపడినట్లు కనిపించలేదు. రాజకీయ నాయకులకు పదవులుంటేనే ఆదరణ ఉంటుందని అనుకున సరిపెట్టుకున్నారు. అందుకే ఆయన నిజంగా ‘‘బడ్జెట్ రోశయ్య’’.