Begin typing your search above and press return to search.

తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్.. ఎవరికి వేస్తారంటే?

By:  Tupaki Desk   |   28 Feb 2021 12:32 PM GMT
తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్.. ఎవరికి వేస్తారంటే?
X
ఇప్పటికి కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రం పరిమితమైన కరోనా వ్యాక్సిన్ రేపటి నుంచి (సోమవారం) అందరికి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి వెలువడింది. కాకుంటే.. సామాన్యులకు అందించే ఈ వ్యాక్సిన్ పొందాలంటే కొన్ని నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. సోమవారం నుంచి సామాన్యులకు ఇచ్చే ఈ వ్యాక్సిన్ ను 60 ఏళ్లకు పైబడిన వారికి ఇస్తారు. అదే సమయంలో 45 నుంచి 59 వయస్కులకు కూడా టీకా తీసుకునే వీలుంది. కాకుంటే.. వీరందరికి దీర్ఘకాలి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్లై ఉండాలి.

కోవిడ్ టీకా కావాలనుకునే వారు మొదట తమ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. cowin.gov.inలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్ కు వచ్చిన లింకు ద్వారా కోవిడ్ టీకా కేంద్రాల్ని గుర్తించే వీలుంది. తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో రెండు చొప్పున.. హైదరాబాద్ లో మాత్రం 12 వ్యాక్సినేషన్ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు.

టీకా వేయించుకునే వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఉంటే.. వారు డాక్టర్లు ఇచ్చే టీకాకు ఓకే చెబుతూ ఇచ్చే ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ధ్రువీకరణ పత్రాన్ని అప్ లోడ్ చేసిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవటానికి అర్హులు. రానున్న వారంలో వెయ్యికి పైగా టీకా సెంటర్లలో వ్యాక్సిన్ వేయనున్నారు. అందరూ మొదటి రోజునే వ్యాక్సిన్ వేసుకోవాలని అనుకోవద్దని.. అందరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున హడావుడి పడాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద వయస్కుల వారి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.