Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: నిందితుల డీఎన్ఏ సేకరణకు కోర్టు అనుమతి

By:  Tupaki Desk   |   27 Jun 2022 10:30 AM GMT
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: నిందితుల డీఎన్ఏ సేకరణకు కోర్టు అనుమతి
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుల డీఎన్ఏ సేకరించడానికి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడం సంచలనమైంది. దీంతో పోలీసులు నిందితుల డీఎన్ఏను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు.

అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపిన ఇన్నోవాలో ఇప్పటికే అధికారుల బృందం ఆధారాలను సేకరించింది. ఇప్పుడు డీఎన్ఏ నమూనాలు సేకరించాక వాహనంలోని ఆధారాలతో అధికారులు పోల్చనున్నారు. ఘటన జరిగినప్పుడు నిందితులు ఇన్నోవాలోనే ఉన్నారా? లేరా? అనే విషయం నిర్ధారణకు డీఎన్ఏ పరీక్షలు కీలకంగా మారనున్నాయి.అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను సేకరించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. మే28వ తేదీన జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ (18) ఏ1గా ఉన్నారు. మిగిలిన ఐదుగురు మైనర్లు. ప్రస్తుతం సాదుద్దీన్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మిగిలిన ఐదుగురు మైనర్లు సైదాబాద్ లోని జువైనల్ హోంలో ఉన్నారు.

ఇప్పటికే జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసులో ముగ్గురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కు లైంగిక సామర్థ్య (పొటెన్సీ) పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు పొటెన్సీ పరీక్షలు తప్పనిసరి. ఈ మేరకు పోలీసులు నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం నిందితులకు పరీక్షలు జరుపనుంది.

మరోవైపు బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక మెడికల్ రిపోర్ట్ పోలీసుల చేతికి వచ్చింది. బాలికపై నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి.. ఒంటిపై 12 తీవ్రగాయాలు చేసినట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. బాలిక నిరాకరించడంతో గోళ్లతో దాడి చేశారు. బాలిక ఒంటిపై 12 తీవ్రగాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇక జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో వీడియోలు వైరల్ చేసిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.