‘పెగాసస్’ను బ్లాక్ చేసిన దేశాలు

Sun Aug 01 2021 20:21:57 GMT+0530 (IST)

Countries that have blocked the Pegasus

ఇజ్రాయెల్ కు చెందిన 'పెగాసస్' సాఫ్ట్ వేర్ సంస్థ ఎస్ఎస్.వో గ్రూపు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా కొన్ని దేశాల్లో తాము తయారు చేసిన 'పెగాసస్' సాఫ్ట్ వేర్ దుర్వినియోగం వల్ల పెద్ద వివాదం చెలరేగడంతో సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే తమ సొంత క్లయింట్లు ఆ స్పైర్ వేర్ ను వినియోగించడానికి వీల్లేకుండా తాత్కాలికంగా బ్లాక్ చేసిందని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి.ఇజ్రాయెల్ కు చెందిన ఎస్.ఎస్.వో గ్రూపు తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను పలు దేశాల ప్రభుత్వాలు ఉగ్రవాదం నేరాలు తదితరాల కట్టడి కోసం కొనుగోలు చేసి వాడుతున్నాయి.  అయితే ఈ లక్ష్యాలకు బదులుగా పౌరులు జడ్జీలు మంత్రులు పాత్రికేయులు మానవహక్కుల నేతలు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఉన్నతాధికారులపై నిఘాకు దుర్వినియోగం చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలు నివేదికలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.

ఎస్ఎస్.వో సంస్థ తాత్కాలికంగా తమ క్లయింట్లు ఈ టెక్నాలజీని వాడకుండా బ్లాక్ చేసింది. పలు మీడియాల సమాఖ్య 'పెగాసస్ ప్రాజెక్ట్' పేరిట ఈ దుర్వినియోగంపై వివరాలు రాబడుతున్న నేపథ్యంలో తమ సంస్థ ఈ చర్య తీసుకుందని ఎస్.ఎస్.వో ఉన్నతాధికారి చెప్పారని ఇజ్రాయెల్ లోని లాభాపేక్షలేని స్వతంత్ర్య మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో (ఎస్.పీ.ఆర్) వెల్లడించింది.

ఇప్పటికే వరుస ఫిర్యాదులతో ఎస్ఎస్.వో ఐదు ప్రభుత్వాలను బ్లాక్ చేసిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. వీటిలో మెక్సికో సౌదీ అరేబియా దుబాయ్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ప్రభుత్వాలు ఫోన్ల హ్యాకింగ్ కు పాల్పడిన ఘటనకు తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. సంస్థ అంతర్గత దర్యాప్తులోనూ ఇదే తేలిందని ఎస్ఎస్.వో తెలిపింది.

ఇక ఇతర దేశాల్లో  పెగాసస్ వల్ల తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో ఇజ్రాయెల్ దేశ ప్రభుత్వం సైతం ఎస్.ఎస్.వో సంస్థపై దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే.. దర్యాప్తులో భాగంగా టెల్ అవీవ్ సిటీ దగ్గర్లోని ఎస్ఎస్.వో ఆఫీసులో అధికారులు దర్యాప్తు చేపట్టారని ఇజ్రాయెల్ రక్షణశాఖ తెలిపింది.

కాగా ఎస్ఎస్.వో సంస్థకు 40 దేశాల్లో 60కు పైగా కస్టమర్లు ఉన్నారని తేలింది. ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ పలు దేశాల నిఘా దర్యాప్తు సంస్థలు సైనిక విభాగాలేనని సమాచారం.