Begin typing your search above and press return to search.

నిజామాబాద్‌ లో కలవరం..15 మంది కోసం ముమ్మర గాలింపు

By:  Tupaki Desk   |   4 April 2020 11:30 AM GMT
నిజామాబాద్‌ లో కలవరం..15 మంది కోసం ముమ్మర గాలింపు
X
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని.. త్వరలోనే కరోనా కనుమరుగవుతుందని భావించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వచ్చిన వారితో షాక్‌ తగిలింది. ఆ ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో రాష్ట్రం నుంచి వెళ్లివచ్చారు. వారందరికీ కరోనా లక్షణాలు ఉన్నాయి. వారిలో చాలామందికి కరోనా సోకడంతో తెలంగాణ ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. 30-40 మధ్య ఉన్న కేసులు అనూహ్యంగా రెండు - మూడు రోజుల వ్యవధిలో 200కు చేరువయ్యాయి. అయితే ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వారిలో పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా వివరాలు సేకరిస్తున్నారు.

ఢిల్లీ మర్కజ్ ప్రభావం మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై తీవ్రంగా పడింది. ఈ జిల్లాలో ఒక్క రోజే 16 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అయితే ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో ఈ జిల్లాకు చెందిన 15 మంది ఉన్నారు. అయితే 15 మంది ఆచూకీ మాత్రం లభించడం లేదు. వారిని గుర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మొత్తంగా ఈ జిల్లా నుంచి 57 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలోలో ఇప్పటికే 42 మందిని క్వారంటైన్‌కు తరలించగా మిగతా 15 మంది ఆచూకీ మాత్రం తెలియడం లేదు.

వారిని వెతికేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. వాళ్లు ఎక్కడున్నారు.. నిజామాబాద్‌ పట్టణంలో కానీ.. ఇతర ప్రాంతాల్లో ఏమైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఇతర ప్రాంతానికి వెళ్లారా అనే విషయంపై పోలీసులు ఇతర శాఖలతో కలిసి సమన్వయం చేసుకుంటూ వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఢిల్లీ నుంచి నేరుగా నిజామాబాద్ వచ్చిన వారు ఎక్కడకు వెళ్లారా? అనేది అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ 15మందికి కరోనా సోకి ఉంటే మిగతా వారికి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. వెంటనే వారిని పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు నిజామాబాద్‌ నగరంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటిని సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ సర్వేకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. సర్వేకు సహకరించడం లేదు. దీంతో వారి ఆచూకీ కనుకోవడం కష్టమైంది. ప్రస్తుతం నిజామాబాద్‌ లో 3 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటుచేసి 174 మందిని ఐసోలేషన్‌ లో ఉంచారు. 15 మందిని మరో 24 గంటల్లో కనిపెట్టాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారు వెలుగులోకి రాక పోవడంతో ప్రస్తుతం నిజామాబాద్‌ పట్టణం లో లాక్‌ డౌన్‌ ను తీవ్రంగా అమలుచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కఠినంగా అమలుచేస్తున్నారు.