Begin typing your search above and press return to search.

కరోనా బాధితుడి వేదన: నేనిలా బతకలేను.. ట్రీట్మెంట్ ఆపేయండి!

By:  Tupaki Desk   |   20 Jun 2021 10:30 AM GMT
కరోనా బాధితుడి వేదన: నేనిలా బతకలేను.. ట్రీట్మెంట్ ఆపేయండి!
X
కరోనా మహమ్మారితో ఎక్కువ కాలం బాధపడుతూ రికార్డుకెక్కిన వ్యక్తి ఇకలేరు. దాదాపు 14 నెలల పాటు వైరస్ తో పోరాడి మృతి చెందారు. ఏడాదికి పైగా వెంటిలేటర్ మీద చికిత్స పొందిన ఆయన... ఇక బతకలేను ట్రీట్ మెంట్ ఆపేయాలంటూ వైద్యులను కోరిన తీరు అందరినీ కలచి వేస్తోంది. బ్రిటన్ లోని వెస్ట్ యాక్స్ కు చెందిన జాసన్ కెక్ మార్చి 31, 2020న కొవిడ్ బారిన పడ్డారు.

ఓ ప్రైమరీ స్కూల్ లో ఐటీ టీచర్ గా పని చేసే జాసన్ 14 నెలల పాటు వైరస్ తో పోరాడారు. ఈ సమయంలో ఊపిరితిత్తులు, కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. టైప్ టూ డయాబెటీస్, ఆస్తమా వంటి సమస్యలు తీవ్రంగా వేధించాయి. శరీరంలోని ముఖ్య అవయవాల పని తీరు మందగించింది. పది నెలల పాటు వెంటిలేటర్ మీదే చికిత్స పొందారు. నడవలేని స్థితికి చేరిన ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడింది. నర్సుల సాయంతో నడిచేవారు. ఆ తర్వాత నుంచి వైద్యం చేసినా ఫలితం లేదు.

ఎక్కువ కాలం మహమ్మారితో బాధ పడిన ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. పైగా కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 14 నెలల చికిత్సతో విసిగిపోయిన జాసన్ తీవ్ర మనో వేదనకు గురయ్యారు. ఇక ఈ బాధలు తట్టుకునే ఓపిక లేదని చెప్పాశారు. నేనిలా బతకలేను.. ట్రీట్ మెంట్ ఆపేయండి అని విజ్ఞప్తి చేశారు. ఆయన కోరిక, కుటంబ సభ్యుల అంగీకారంతో వైద్యులు చికిత్స ఆపేశారు. ఈ క్రమంలో శనివారం మరణించారు.

కరోనాతో ఆయన చేసిన పోరాటం చాలా గొప్పదని జాసన్ భార్య అన్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేక బోరున విలపించారు. మహమ్మారితో జాసన్ పోరాటాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. బ్రిటన్ లాంగెస్ట్ కరోనా పేషెంట్ గా గుర్తించిన జాసన్ మరణించిన విధానం ఆ దేశస్థులతో పాటు అందరినీ కంటనీరు పెట్టిస్తోంది. ఈ మహమ్మారి ఎవరిని ఏ రకంగా బలితీసుకుంటుందో చెప్పలేమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.