కరోనా వ్యాక్సిన్... హైదరాబాద్ నుంచే అదిరిపోయే వార్త

Fri Jun 11 2021 08:36:23 GMT+0530 (IST)

Corona vaccine Good news from Hyderabad

కరోనా మహమ్మారికి చెక్ పెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొంటున్న వ్యాక్సిన్ పై అందరి దృష్టి ఉన్న సంగతి తెలిసిందే. అయితే టీకాల కొరత కారణంగా అర్హులందరికీ అందించలేకపోతున్న పరిస్థితి. 18 ఏళ్ళు నిండిన భారత ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినప్పటికీ సరిపడా టీకాలు ఎలా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో మన హైదరాబాద్ తానున్నానని నిలిచింది. బయోలాజికల్-ఈ నుంచి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. ఇంతేకాకుండా ఈ టీకా ధర ఇప్పటికే ఉన్నవాటి కంటే తక్కువ కావడం మరో విశేషం.ప్రస్తుతం మనదేశంలో కొవాగ్జిన్ కొవిషీల్డ్ స్పుత్నిక్-వి టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ డిమాండ్ కు తగ్గట్లు ఈ టీకాల సరఫరా లేదు. మరోవైపు ఈ టీకాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకుంటే భారీ ధరలు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి అటు దరను అందుబాటులో ఉంచేందుకు కొత్త టీకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా  త్వరలో బయోలాజికల్-ఈ నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.

బయోలాజికల్-ఈ రెండు డోసులు కలిపి రూ. 650లోపే ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఉన్న టీకాలకంటే అతి తక్కువ ధరకే ఈ టీకా ఉండబోతోంది. ఒక్కో డోసు ధర రూ. 150కే అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ టీకాలు అందుబాటులోకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న అతి చవకైన వ్యాక్సిన్ బయోలాజికల్-ఈ ద్వారా సరఫరా అయ్యే టీకాదే కానుంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థతో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటికే 30 కోట్ల డోసుల కోసం ఆర్డర్ కూడా ఇచ్చేసింది.