Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా ముప్పు తప్పినట్టే .. !

By:  Tupaki Desk   |   17 Jun 2021 9:31 AM GMT
వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా ముప్పు తప్పినట్టే .. !
X
కరోనా వ్యాక్సిన్లు వైరస్ బారినపడకుండా , కరోనా ముప్పు నుండి కాపాడుతున్నట్ట తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ల సామర్థ్యంపై అపోలో హాస్పటిల్స్ గ్రూప్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 95.8 శాతం మందికి వైరస్ సోకలేదని తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఒక్క మరణం కూడా నమోదుకాలేదని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 24 నగరాల్లో 43 అపోలో ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 31,621 మంది హెల్త్ కేర్ సిబ్బందిపై ఈ అధ్యయనం జరిపారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కేవలం 4.28 శాతం మంది మాత్రమే తిరిగి వైరస్ బారినపడ్డారు. వీరిలో మధ్యస్థ లక్షణాలతో 90 మంది(0.28శాతం) ఆస్పత్రిలో చేరగా..వారిలో ముగ్గురు(0.009శాతం) ఐసీయూలో చికిత్స అవసరం ఏర్పడింది. వీరు ముగ్గురూ ఐసీయూ చికిత్స అనంతరం కోలుకున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ బుధవారం వెల్లడించింది.

దీన్ని బట్టి చూస్తే .. కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మరణాలు నమోదుకాలేదని తెలిపింది. వ్యాక్సిన్లతో పూర్తి రక్షణ ఉంటుందని తమ అధ్యయనంలో తేలినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ.రెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్‌తోనే థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్లను తొలుత హెల్త్ కేర్ సిబ్బందికి అందించడం ద్వారా వారు ఎంతో మంది రోగులకు చికిత్స కల్పించినట్లు చెప్పారు. దేశంలో రోజుకు 50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్, చేతుల శుభ్రత, భౌతిక దూరం జాగ్రత్తలు పాటించాలని సూచించారు..

దేశంలో సెకండ్ వేవ్ ఉధృతి నెలకొన్న సమయంలో నాలుగున్నర నెలల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. సెకండ్ వేవ్ ఏప్రిల్, మే మాసాల్లో ఉధృతంగా ఉండగా…పలువురు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న కొందరు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కూడా సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో రెండు డోసుల టీకా తర్వాత ఒక్కరు కూడా మరణించలేదన్న అపోలో ఆస్పత్రుల అధ్యయనం తో వ్యాక్సిన్ల పై మరింత నమ్మకం కుదిరే అవకాశం ఉంది.