Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : వెలవెలబోతోన్న తిరుమల !

By:  Tupaki Desk   |   11 May 2021 5:59 AM GMT
సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : వెలవెలబోతోన్న తిరుమల !
X
తిరుమల తిరుపతి దేవస్థానంపై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి సమయంలో తిరుమలలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దానికి తోడు ఇటీవల విశ్రాంత ప్రధాన అర్చకులు కరోనా కారణంగా మరణించడంతో తిరుమల వెళ్లాలి అంటేనే శ్రీవారి భక్తులు భయపడుతున్నారు. దీనికి తోడు 12 తర్వాత పాక్షిక లాక్ డౌన్ అమల్లోకి ఉండడంతో స్వామివారి దర్శనానికి భక్తులు రావడం లేదు. లాక్‌ డౌన్ లేని స‌మ‌యంలో రికార్డుస్థాయిలో క‌నిష్ట‌స్థాయికి భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గింది. నిన్న ఒక్క రోజు కేవ‌లం 2,400 మంది భ‌క్తులు మాత్ర‌మే శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అలాగే 1375 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. శ్రీ‌వారి ఆదాయం రూ.24 ల‌క్ష‌లు మాత్రమే.

గ‌త ఏడాది కరోనా ఫ‌స్ట్ వేవ్ సంద‌ర్భంలో లాక్‌ డౌన్ విధించారు. ఆ సమయంలో కొద్ది రోజుల పాటు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌లేదు. దీనితో గ‌త ఏడాది భ‌క్తులు లేక ఆ తిరుమలకొండ పూర్తిగా వెల‌వెల‌పోయింది. కానీ ఇప్పుడు పాక్షిక లాక్‌ డౌన్ అమ‌ల్లో ఉంది. అయిన‌ప్ప‌టికీ కూడా క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతితో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. దీంతో బ‌తికి ఉంటే ఇప్పుడు కాక‌పోతే, మ‌రెప్పుడైనా శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌నే భావ‌న‌లో భ‌క్తులున్నారు. అందువ‌ల్లే తిరుమ‌ల‌కు వెళ్లేందుకు భ‌క్తులెవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే స‌ర్వ‌ద‌ర్శ‌నాన్ని టీటీడీ ర‌ద్దు చేసింది. కేవ‌లం రూ.300 టికెట్లు, బ్రేక్ ద‌ర్శ‌నం మాత్ర‌మే అందుబాటులో ఉంది.

తిరుమ‌ల‌కు వెళితే ఎక్క‌డ క‌రోనాబారిన ప‌డతామోన‌నే ఆందోళ‌న ఉండ‌డం వ‌ల్ల భ‌క్తుల రాక భారీగా తగ్గినట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. కరోనా భయం కారణంగా భక్తుల రాకపై ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తోంది టీటీడీ. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉన్నవారు ఎవరూ రావొద్దు అని స్పష్టం చేసింది. కేవలం ఆన్ లైన్ లో టోకెట్లు తీసుకున్నవారిని మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తున్నారు. ఐతే రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ప్రారంభమైన నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలకు అనుమతి ఉందా లేదా అనే దానిపై భక్తుల్లో కొంత ఆయోమయం నెలకొంది. దీనిపై ఇప్పటికే టీటీడీ పాలకమండలి భక్తులకు స్పష్టతనిచ్చింది. శ్రీవారి దర్శనాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని టీటీడీ భరోసా కల్పించినా భక్తులు రావడానికి భయపడుతున్నారు. ఆన్ లైన్ లో టోకెట్లు తీసుకున్న సంఖ్యలో భక్తులు రావడం లేదంటున్నారు అధికారులు.