Begin typing your search above and press return to search.

దేశంలో హడలెత్తిస్తోన్న కరోనా 'పాజిటివిటీ' రేటు

By:  Tupaki Desk   |   12 May 2021 1:30 PM GMT
దేశంలో హడలెత్తిస్తోన్న కరోనా పాజిటివిటీ రేటు
X
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభణ చేస్తుంది. దానికి సంబంధించి ప్రతీ రోజు వెల్లడవుతున్న గణాంకాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు రెండు నెలల క్రితం దేశంలో కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. అప్పటినుండి నుంచి కొత్త రకం కరోనా కు సంబంధించి ఆందోళన కలిగించే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. డబుల్ మ్యూటెంట్ అయిన కరోనా వైరస్ శరవేగంగా దేశంలో విస్తరిస్తోందని గణాంకాలు చాటుతున్నాయి. తాజాగా వెల్లడైన లెక్కల్లో దేశంలోని 90 శాతం ఏరియాలో పాజిటివిటీ రేటు ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. రెండో దశ కరోనా వైరస్ ఉధృతిని అంఛనా వేసేందుకు పలు సంస్థలు దేశవ్యాప్తంగా వివిధ మార్గాలలో సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేల ఫలితాలను గమనిస్తే.. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా వున్నట్లు తేలింది.

మన దేశంలో దాదాపు 90 శాతం ప్రాంతంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం 734 జిల్లాలుండగా వాటిలో 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 5 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు సగటున 21 శాతం వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మే 12న వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు అధికంగా వున్న రాష్ట్రాలలో గోవా మొదటి స్థానంలో వుంది. ఆ తర్వాత పుదుచ్ఛేరి, బెంగాల్, హర్యానా , కర్నాటక రాష్ట్రాల్లో అధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. గోవాలో కొత్త కేసుల పాజిటివిటీ రేటు ఏకంగా 48 శాతంగా నమోదైంది. హర్యానాలో ఇది 37 శాతంగా రికార్డయ్యింది.

మరోవైపు నాగాలాండ్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాజిటివిటీ రేటు ఇపుడిపుడే పెరుగుతున్న సంకేతాలు అందుతున్నాయి. మొన్నటి దాకా కరోనా విలయ తాండవం చేసిన ఢిల్లీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో రోజు వారీ కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు బెంగళూరు అర్బన్, చెన్నై, ఎర్నాకులం, మలప్పురం జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పాజిటివిటీ శాతం 10కి మించితే ఆయా ప్రాంతాల్లో సంపూర్ణంగా లాక్ డౌన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. అయితే,మెజారిటీ రాష్ట్రాలు ప్రస్తుతం సంపూర్ణ లాక్ డౌన్లు విధించాయి. కొన్ని మాత్రం పాక్షిక లాక్ డౌన్‌లతో ప్రయోగాలు చేస్తున్నాయి.