స్వల్ప లక్షణాలతో చంద్రబాబుకు కరోనా పాజిటివ్

Tue Jan 18 2022 09:45:28 GMT+0530 (IST)

Corona positive for Chandrababu

మూడో వేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడనుందా? అన్న అనుమానానికి బలం చేకూరేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రత తక్కువగా అయినా పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ లు నమోదవుతున్నాయి. నిన్నటికి నిన్న (సోమవారం) నారా లోకేశ్ కుకరోనా పాజిటివ్ కావటం తెలిసిందే. అదే రోజు రాత్రికి టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం లక్షణాలు కనిపించటం.. వెంటనే పరీక్ష చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.దీంతో.. ట్విటర్ ఖాతా వేదికగా ఆయన తనకు పాజిటివ్ అయిన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరుతున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయనకు కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనకు మిగిలిన వైద్య పరీక్షలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.

మరోవైపు చంద్రబాబు కుమారుడు కమ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పాజిటివ్ గా తేలటం.. ఆయన సోమవారం ట్విటర్ ఖాతాలోపేర్కొనటం తెలిసిందే. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చూస్తుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఏ ఒక్కరికి వచ్చినా.. మిగిలిన వారికి ఇట్టే పాకుతుందన్న మాట వినిపిస్తోంది. వీలైనంతవరకు రానున్న 20రోజుల పాటు కొత్తప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.