Begin typing your search above and press return to search.

కరోనా లాక్ డౌన్: పారిస్ నుంచి పల్లెలకు జనాలు

By:  Tupaki Desk   |   30 Oct 2020 11:10 AM GMT
కరోనా లాక్ డౌన్: పారిస్ నుంచి పల్లెలకు జనాలు
X
శీతాకాలం మొదలైంది.. కరోనా వైరస్ విజృంభణ స్ట్రాట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ లో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆ దేశంలో రెండో వేవ్ మొదలు కావడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఈ లాక్ డౌన్ విధించాడు.

ఓవైపు కరోనా భయం.. విస్తరిస్తున్న వైరస్ ధాటికి ఫ్రాన్స్ రాజధాని నగరం పారిస్ ను జనాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా పారిస్ నుంచి భారీస్థాయిలో ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు పయనమయ్యారు. లాక్ డౌన్ తో సర్వం బంద్ కావడంతో ఇక పట్టణాలకంటే పల్లెలే సేఫ్ అని ఇలా వలస బాటపట్టారు.

గురువారం సాయంత్రం పారిస్ పరిసరాల్లో ట్రాఫిక్ రికార్డు స్థాయికి పెరిగిపోయింది. మొత్తంగా చూస్తే 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు అయ్యాయని స్థానిక మీడియా చెప్పింది. పారిస్ నగరవాసులు చాలా మంది లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించటం కోసం నగరం విడిచి వెళ్లారని పేర్కొంది.

శుక్రవారం అర్ధరాత్రి నుంచి అత్యవసర పనులు, వైద్య కారణాలు మినహా ప్రజలు బయటకు రావద్దని ఫ్రాన్స్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని స్పష్టం చేసింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలు కావడానికి ముందే పారిస్ నగరాన్ని ప్రజలు ఖాళీ చేస్తున్నారు.

ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో కరోనా కేసులు ఏప్రిల్ తర్వాత ఇప్పుడు మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గురువారం ఏకంగా దేశంలో 47,637 కరోనా కేసులు, 250 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు దేశంలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ విధించారు. జనాలు సిటీ కంటే పల్లెలు బెస్ట్ అని వలస బాట పడుతున్నారు.

మన దేశంలో సైతం ఇలాంటి ధోరణే కనపడింది.మార్చిలో దేశంలో లాక్ డౌన్ విధించడంతో హైదరాబాద్ నుంచి జనాలు సొంతూళ్లకు తరలిపోయారు. వలస కార్మికులు అయితే వేల కిలోమీటర్లు నడిచి స్వరాష్ట్రాలకు పయనమయ్యారు. ఇప్పుడు కరోనా రెండో వేవ్ తో దేశంలోనే ఇలాంటి దృశ్యాలే కనిపించడం తధ్యం అని అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.