Begin typing your search above and press return to search.

కరోనా కారణంగా ఆ దేశంలో ఒక్కరోజులో 4వేల మంది చనిపోయారు

By:  Tupaki Desk   |   8 April 2021 9:30 AM GMT
కరోనా కారణంగా ఆ దేశంలో ఒక్కరోజులో 4వేల మంది చనిపోయారు
X
అలవాటుగా మారితే ఏదైనా కష్టంగా అనిపించదు. కొన్ని విషయాల్లో ఈ తీరు మంచిదే అయినా.. కరోనా విషయంలో మాత్రం తీవ్రమైన విషాదానికి దారి తీస్తుంది. ఏడాది క్రితం పరిచయమైన కరోనా.. అలవాటుగా మారి.. ఫర్లేదులే అన్న నిర్లక్ష్యం.. పెద్దగా ప్రభావం చూపించదన్న అలక్ష్యం ఇప్పుడు కొన్ని దేశాల్ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది బ్రెజిల్. ఆ దేశంలో కరోనా కేసుల నమోదు చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు.. మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.

నిన్న (బుధవారం) ఒక్క రోజులోనే బ్రెజిల్వ్యాప్తంగా 4,195 మంది మరణించిన వైనం ప్రపంచ దేశాలు ఒక్కసారి అలెర్టు అయ్యేలా చేశాయి. కరోనా కారణంగా మరణిస్తున్న వారు అమెరికాలో అత్యధికంగా ఉంటే.. రెండో స్థానంలో బ్రెజిల్ నిలుస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న మరణాలు ఆ దేశంలో కరోనా తీవ్రతను అద్దం పట్టేలా మారాయి. రోజులో నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు ఇప్పటివరకు అమెరికా.. పెరూ దేశాల్లోనే ఉన్నాయి. ఆ దరిద్రపు రికార్డులో తాజాగా బ్రెజిల్ కు స్థానం లభించింది.

అంతకంతకూ పెరుగుతున్న కేసులతో బ్రెజిల్ లో ఆరోగ్య పరిస్థితి కుప్పకూలినట్లుగా చెబుతున్నారు. రోగులతో నిండిన ఆసుపత్రులతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బ్రెజిల్ లో అత్యంత రద్దీ రాష్ట్రంగా చెప్పే సావోపాలో ఒక్కరోజులో 1400లకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ రాష్ట్రంలో 4.6 కోట్ల మంది జనాభా నివసిస్తూ ఉంటారు. కొత్త కేసుల నమోదు ఒకవైపు.. మరోవైపు అంతకంతకూ పెరిగిపోతున్న మరణాలతో బ్రెజిల్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరోనా ధాటికి ఇప్పుడా దేశం విలవిలలాడుతోంది.