Begin typing your search above and press return to search.

దేశ రాజ‌ధానిలో క‌రోనా క‌ల్లోలం!

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:39 AM GMT
దేశ రాజ‌ధానిలో క‌రోనా క‌ల్లోలం!
X
త‌గ్గినట్టే త‌గ్గిన క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ కోర‌లు చాస్తోంది. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తోపాటు సెల‌బ్రిటీలు దీని బారిన‌ప‌డుతున్నారు. ఇప్పటికే ఒక‌సారి క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్న‌వారిని కూడా వ‌ద‌ల‌కుండా విజృంభిస్తోంది.

క‌రోనా ఒమిక్రాన్ వేరియంటులో కొత్త సబ్-వేరియంట్ BA 2.75 వెలుగుచూసింద‌ని వైద్యులు చెబుతున్నారు. ఇప్ప‌టికే కోవిడ్ టీకా ద్వారా యాంటీబాడీల‌ను పొందిన‌వారికి కూడా సోకుతోంద‌ని అంటున్నారు. BA.2.75 అంటువ్యాధుల పెరుగుదలకు దారితీస్తోంద‌ని, అయితే ఈ వేరియంట్ ప్రమాదకరమైనది కాద‌న్నారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఫోర్త్ వేవ్‌లో కూడా భారీగా కేసులు న‌మోదవుతున్నాయి. ఆగ‌స్టు 17 బుధ‌వారం ఒక్క‌రోజే 1652 కేసులు వెలుగు చూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6809కి చేరింది. కరోనా వైరస్ సోకిన 8 మంది మృత్యువాత ప‌డ్డారు. పాజిటివిటీ రేటు ఏకంగా 9.92 శాతం ఉండ‌టం గ‌మ‌నార్హం. కాగా 24 గంటల్లో 1702 మంది కోలుకున్నారు.

ఆగ‌స్టు 1 నుంచి ఢిల్లీలో కరోనా కేసులు వంద శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం. గ‌త వారం నుంచి అంటే ఆగ‌స్టు 13 నుంచి రోజుకు ఐదుగురికి త‌గ్గ‌కుండా క‌రోనా బారిన‌ప‌డి మృతి చెందుతున్నారు. అదేవిధంగా ఢిల్లీ ఆస్ప‌త్రుల్లో క‌రోనాతో చేరిన‌వారి సంఖ్య ఏకంగా రెండు రెట్లు పెరిగింద‌ని వైద్య‌లు అంటున్నారు. 205 మందికి ఆక్సిజన్ అవ‌స‌ర‌మ‌వుతోంది. 22 మంది వెంటిలేటర్ పైన ఉన్నారు. ఐసీయూలో ఆగ‌స్టు 16 నాటికి 202 మంది ఉన్నారు.

కోవిడ్ పాజిటివిటీ రేటు పెరగడంతో ఢిల్లీ ప్ర‌భుత్వం, వైద్యాధికారులు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.గ‌త రెండు వారాలుగా రోజూ 2000 కేసులు వ‌స్తుండ‌టంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఇప్ప‌టికే రెండు కోవిడ్ డోసులు వేసుకున్న‌వారికి బూస్ట‌ర్ డోసు వేస్తున్నారు. కోవిడ్ రెండు డోసుల కంటే ఈ బూస్ట‌ర్ డోస్టు మంచి ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తోంద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 17న 9062 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 36 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం 1,05,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి.