మళ్లీ పెరుగుతోన్న కరోనా .. ఫస్ట్ సెకండ్ వేవ్ ప్రారంభంలో ఈ తరహా .. !

Mon Jul 26 2021 15:23:28 GMT+0530 (IST)

Corona growing again

చైనా లో వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి ఎన్ని చేసినా కూడా తగ్గడం లేదు. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అంటూ పెరుగుతూనేపోతుంది తప్ప తగ్గే సూచనలే కనిపించడంలేదు. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొంతమేర తగ్గినా కూడా కరోనా బాధితుల సంఖ్య మాత్రం మళ్లీ పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా జోరు తగ్గింది అని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ ఆస్పత్రుల్లో రోగుల చేరికలు చూస్తే పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూస్తే వారం నుంచి ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోతుంది.వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి రోజుకు సగటున 650-725 కేసులు నమోదు అవుతున్నాయి. కొద్దికొద్దిగా కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నట్లు చూపుతున్నారు. దీన్ని బట్టి ఆస్పత్రుల్లో చేరికలు కూడా ఇలాగే తగ్గాలి. కానీ పెరుగుతుండటం గమనార్హం. ఈ నెల 23 నాటికి ఆస్పత్రుల్లో 3809 మంది రోగులుంటే ఆదివారం ఆ సంఖ్య 3906 (ఆక్సిజన్‌పై 1761 ఐసీయూ వెంటిలేటర్‌పై 1344 మంది)కి చేరినట్లు వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలను బట్టి రెండు రోజుల్లోనే కొత్తగా వందిమంది ఆస్పత్రుల్లో చేరారు. ఇది ఆందోళనకర సంకేతమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మొదటి రెండో వేవ్ లలో మెల్లమెల్లగా ఆస్పత్రుల్లో అడ్మిషన్స్ పెరిగి చూస్తుండగానే పతాక స్థాయికి చేరిందని గుర్తుచేస్తున్నారు.

కాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కేసులు అధికంగానే ఉన్నాయి. మన రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లోనూ పాజిటివ్ లు ఏమాత్రం తగ్గడం లేదు. ఖమ్మం వంటిచోట్ల రోజుకు 300 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వమే గద్వాల కొత్తగూడెం మంచిర్యాల పెద్దపల్లి వరంగల్ రూరల్ అర్బన్ ములుగు జయశంకర్ భూపాలపల్లి నారాయణపేట నల్లగొండ సూర్యాపేటలను కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించింది. వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఎక్కువమందికి టీకా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 91457 మందికి పరీక్షలు చేయగా.. 494 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో నలుగురు మృతి చెందారు. 710 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 6.41 లక్షలకు మరణాలు 3784కు పెరిగాయి. 9405 యాక్టివ్ కేసులు ఉన్నాయి.శనివారం 134177 మంది టీకా రెండో డోసు పొందారు. 29736 మంది తొలి డోసు తీసుకున్నారు. ఇప్పటి వరకు 1.10 కోట్ల మంది మొదటి 29.37 లక్షల మంది రెండో డోసు పొందారు. కాగా ఏపీలో కొత్తగా 2252 మంది కొవిడ్ బారినపడ్డారు. 15 మంది కరోనాతో మరణించారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 13256 మంది కరోనాతో మరణించారు.

దేశంలో గడచిన 24 గంటల్లో 39361 కరోనా కేసులు నమోదైనాయి. కరోనా కేసుల సంఖ్య ఆదివారం నుంచి సోమవారానికి 3.41 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో కరోనాతో 416 మంది మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 31411262కు పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 420967 మంది మరణించారు. ఇండియాలో నిన్న అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా కేరళలో 17466 కొత్త కేసులు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 6843 కేసులు వచ్చాయి. ఆ తర్వాత మిజోరంలో 2307 ఆంధ్రప్రదేశ్‌లో 2252 కేసులు వచ్చాయి. మిగతా రాష్ట్రాల్లో 2వేల కంటే తక్కువ కేసులు వచ్చాయి. మరణాలు చూస్తే నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 123 మంది చనిపోగా... ఒడిశాలో 67 మంది కేరళలో 66 మంది చనిపోయారు. కొత్త కేసులు వరుసగా నాలుగో రోజు 40 వేల కంటే తక్కువ వచ్చాయి. సోమవారం 35968 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 97.35గా నమోదైంది. దేశం మొత్తంమీద 435196001 మందికి కొవిడ్ టీకాలు వేశారు.