Begin typing your search above and press return to search.

32 మంది టెన్త్ విద్యార్థులకు కరోనా

By:  Tupaki Desk   |   4 July 2020 3:30 PM GMT
32 మంది టెన్త్ విద్యార్థులకు కరోనా
X
ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వైరస్ విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రాణాంతక వైరస్ పేరు చెబితేనే ఆయా దేశాల ప్రజలు వణికిపోతున్నారు. ఇక, 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లోనూ ఈ మాయదారి వైరస్ పాగా వేసింది. దాదాపుగా ఆరున్నర లక్షలకు పై చిలుకు పాజిటివ్ కేసులతో భారత్ ను అతలాకుతలం చేస్తోన్న ఈ వైరస్...ఇప్పటి దాకా 18వేలకు పైగా ప్రాణాలను బలిగొంది. రోజురోజుకీ గణనీయంగా పెరిగిపోతోన్నకేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని...మనదేశంలోని పలు రాష్ట్రాలు పాఠశాలలు, కళాశాలలకు సెలవులిచ్చాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ తదితర పరీక్షలను రద్దుచేసి...విద్యార్థులందరినీ పాస్ చేశాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని ఏపీ, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు భావించాయి. అయితే, పొరుగునున్న కర్ణాటక రాష్ట్రంలో మాత్రం యథావిధిగా టెన్త్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విపక్ష పార్టీలు వద్దని వారిస్తున్నా వినకుండా....పరీక్షలను నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టెన్త్ పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో యడియూరప్ప సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కర్ణాటకలో కేసులు తగ్గినట్లే తగ్గి...ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య 18వేల మార్క్ దాటేసింది. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా... జూన్‌ 25 నుంచి జూలై 3 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7,61,506 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు జరిగిన పదో తరగతి పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినా కూడా విద్యార్థులకు వైరస్ సోకడంతో అధికారులు నివ్వెరపోతున్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులకు కరోనా రావటంతో వారి తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించకుండా ఉంటేనే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జూన్ నెలలో బెంగళూరులో మొత్తం 4,198 మంది కరోనా బారిన పడగా, అందులో 85 మంది మరణించారు. 312 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 1నుంచి 15వ తేదీ వరకు బెంగళూరులో పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ 16 వ తేదీ నుంచి కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది.