Begin typing your search above and press return to search.

భారత్‌ లో 20 లక్షలు దాటిన కరోనా కేసులు !

By:  Tupaki Desk   |   7 Aug 2020 11:10 AM GMT
భారత్‌ లో 20 లక్షలు దాటిన కరోనా కేసులు !
X
భారత్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. దేశంలో వైరస్‌ కేసుల సంఖ్య గురువారం నాటికి 20 లక్షలు దాటాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 20,27,075కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 41,585కి పెరిగింది. 6,07,384 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు.

భారత్‌ లో ఒక్క రోజులో 60 వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. రోజువారీ కేసుల విషయంలో ప్రస్తుతం అమెరికాను ఇండియా దాటేసింది. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. 07గా ఉంది. అయితే భారత్‌ లో కరోనా కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతానికి పెరిగింది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,27,24,134 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులో 5,74,783 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

ఇకపోతే , అమెరికాలో కూడా కరోనా విజృంభణ ఆగడంలేదు. గడిచిన 24 గంటల్లో 58 వేల కొత్త కేసులు నమోదవ్వగా 2,060 మంది కరోనాతో కన్నుమూశారు. గత మూడు నెలల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇదే అత్యధికం కావడం గమనార్హం. గతంలో మే 7న అమెరికాలో ఒకే రోజు 2 వేల మరణాలు సంభవించాయి. ఇక అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5 మిలియన్లు దాటింది. గురువారం నాటికి 5,032,179 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా మృతుల సంఖ్య 1,62,804కు చేరింది. 2,576,668 మంది కోలుకున్నారు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 19 మిలియన్ల జనాభా కరోనా బారిన పడ్డారు. మొత్తం 19,254,157 మందికి కరోనా సోకగా.. 7,17,655 మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.