Begin typing your search above and press return to search.

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కరోనా విజృంభణ .. !

By:  Tupaki Desk   |   7 Aug 2020 2:00 PM GMT
రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కరోనా విజృంభణ .. !
X
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. ప్రతి రోజు నమోదు అయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలకు దగ్గరగా ఉన్నాయి. ఇదిలా రాష్ట్రం మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కలకలం రేపుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని 265మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంత భారీ సంఖ్యలో ఖైదీలకు కరోనా వైరస్ సోకడం కలకలంరేపుతోంది.

రాజమండ్రి సెంట్రల్ జైలులో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు. ఖైదీల్లో 900 మందికి ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించారు. 900 మందికి నిర్వహించిన పరీక్షల్లో 247 మందికి పాజిటివ్ అని తేలింది. కొత్తగా నిర్ధారణ జరిగిన 247 మంది ఖైదీలకు సెంట్రల్ జైల్లోనే చికిత్స అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక 10 మంది ఖైదీలకు రాజమండ్రిలోని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కరోనా సోకిన ఖైదీలకు జైలులో ఉన్న న్యూ సీపీ బ్లాక్‌లో ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇంకా 300 మంది ఖైదీల పరీక్షల రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైలులో మూలాఖత్ నిలిపివేశారు అధికారులు. ఇక‌ జైళ్లో అడ్మినిస్ట్రేష‌న్‌, డాక్టర్ ద్వారా కరోనా సోకినట్టు స‌మాచారం.

కాగా ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,96,789కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 72 మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,753కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,516 మంది కరోనాను జయించగా కోలుకున్న వారి సంఖ్య 1,09,975కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.