Begin typing your search above and press return to search.

ఉత్తరకొరియాలో కరోనా భీతావాహం.. ప్రపంచంపైకి మరో మహమ్మారినా?

By:  Tupaki Desk   |   16 May 2022 9:52 AM GMT
ఉత్తరకొరియాలో కరోనా భీతావాహం.. ప్రపంచంపైకి మరో మహమ్మారినా?
X
ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన ప్రజారోగ్య వ్యవస్థ కలిగిన దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. పశ్చిమ దేశాలు, అమెరికా ఆంక్షల నేపథ్యంలో దేశం తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ లు, యాంటీవైరల్ ట్రీట్ మెంట్ డ్రగ్స్, మాస్ టెస్టింగ్ సదుపాయాలు వంటి అందుబాటులో లేవు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చినా నియంత కిమ్ జాంగ్ నిరాకరించారు. దాంతో రెండున్నర కోట్ల మంది ప్రజలు ఇప్పుడు కరోనాకు విలవిలలాడిపోతున్నారు.

ఉత్తరకొరియాను కరోనా అతలాకుతలం చేస్తోంది. దేశ చరిత్రలోనే ఘోరమైన విపత్తుగా ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ విపత్కర సమయంలో ప్రజలు, ప్రభుత్వం కరోనాతోనే పోరాడాలని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ మాస్క్ తో కనిపించని ఆయన ఇప్పుడు మాస్క్ ధరించి దర్శనమివ్వడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది.

కరోనాతో ఉత్తరకొరియాలో మరణ మృదంగం వినిపిస్తోంది. టీకాలు లేవు.. మందులు లేవు. అత్యంత పేద దేశం కావడం.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకపోవడంతో ఉత్తరకొరియా ఇప్పుడు పెనుముప్పుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరించే కరోనా వేరియంట్ 'ఒమిక్రాన్'. దీనికంటే ముందు భారత్ లో సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా మన దేశంలో మరణ మృదంగాన్ని వినిపిస్తోంది. ఆ సమయంలో దేశంలో ఆస్పత్రులు నిండి.. శశ్మనాల్లో శవాల కుప్పలు కనిపించాయి. నాడు దేశంలో వైద్య సంక్షోభం నెలకొంది.

ఇక దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' యూరప్ దేశాలను, అమెరికాను వణికించింది. గడగడలాడించింది. పెద్ద ఎత్తున కేసులు, మరణాలను కలిగించింది. ఇదే ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరించే వైరస్ వేరియంట్. ఇప్పుడు ఇదే వేరియంట్ చైనాలో వేగంగా విస్తరించింది.చైనాకు ఆనుకొని ఉండే ఉత్తరకొరియాలో ఇప్పుడు మరణ మృదంగం వినిపిస్తోంది.

రెండేళ్లుగా కరోనా దేశంలోకి రాకుండా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ దేశంలోకి తలుపులు మూసేశారు. అయితే చైనా సరిహద్దుల ద్వారా ఈ వైరస్ ఉత్తరకొరియాకు వ్యాపించింది. విస్తరించింది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే దేశంలో బాధితుల సంఖ్య 8,20,620కు చేరింది. రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచే అధికంగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 3,24,550 మంది ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.

ఉత్తరకొరియాలోకి విదేశీయులకు అనుమతి లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎంట్రీ లేదు. వైద్య, మౌళిక సదుపాయాలు లేవు. ఎవరికీ ప్రవేశం లేని ఆ దేశంలో ఇప్పుడు కొత్త కరోనా వేరియంట్ రూపాంతరం చెంది విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడా కొత్త వేరియంట్ పుట్టి ప్రపంచానికి పాకితే పెను వినాశనం తప్పదు. ఎందుకంటే దేశంలో డెల్టా, ఆఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ ఇప్పుడు ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో చూశాం.

ఇప్పుడు ఉత్తరకొరియాలో ప్రళయం చూస్తుంటే అందరికీ భయాలు కలుగుతున్నాయి. అక్కడ దేశంలో లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కంగారుపడుతోంది. ఉత్తరకొరియాలో వైద్య సౌకర్యాలు లేకపోవడం.. పేదలే ఎక్కువగా ఉండడం.. నియంత కిమ్ ఎలాంటి వైద్యపరికరాలు, సహాయాన్ని విదేశాల నుంచి తీసుకోకపోవడంతో ఇప్పుడు ఉత్తరకొరియాలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. అది ప్రపంచానికే పెనుముప్పుగా మారింది. ఇది విస్తరిస్తే ప్రపంచానికే పెను ప్రమాదం.