Begin typing your search above and press return to search.

విదేశాలు ఆదుకోకపోతే అంతే సంగతులా ?

By:  Tupaki Desk   |   22 May 2022 5:03 AM GMT
విదేశాలు ఆదుకోకపోతే అంతే సంగతులా ?
X
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ పరిస్థితులు చాలా భయంకరంగా తయారయ్యాయి. నానాటికీ దేశంలోని ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయి. ప్రతిరోజు కరోనా వైరస్ కారణంగా 2.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది కరోనా వైరస్ బాధితులున్నట్లు నార్త్ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ దేశాలంతా కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో నార్త్ కొరియాలో ఒక్క కేసు కూడా లేదు.

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు దాదాపు నియంత్రణలో వస్తున్నది అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా నార్త్ కొరియాలో వేలతో మొదలైన కేసులు లక్షలకు చేరుకుంటున్నాయి. ఒక్కసారిగా లక్షలకు చేరుకుంటున్న బాధితులకు వైద్య సౌకర్యాలు అందించేందుకు ఆసుపత్రులు, వైద్య సిబ్బంది కూడా లేరు. కోవిడ్ టీకాలను దేశంలోకి అడుగుపెట్టేందుకు లేకుండా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసిన నిర్వాకమే ఇప్పటి పరిస్ధితికి కారణం.

ఇపుడు లక్షల్లో పెరిగిపోతున్న కేసులను నియంత్రించేందుకు ప్రపంచ దేశాల సాయం కోసం కిమ్ ఆలోచిస్తున్నారట. ఇదే విషయమై ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, ప్రపంచారోగ్య సమితి ప్రతినిధులతో కిమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జ్వరాలతో బాధపడుతున్న జనాలను తరలించేందుకు క్వారంటైన్ సెంటర్లు కూడా సరిపడా లేవు. ఒకపుడు కరోనా వైరస్ నియంత్రణకు సాయం అందిస్తామని ప్రపంచ దేశాలు ఎంత చెప్పినా అప్పట్లో కిమ్ అంగీకరించలేదు.

జనాలకు వైద్య పరీక్షలు చేయించలేదు, ముందు జాగ్రత్తగా ఆసుపత్రుల సంఖ్యను పెంచలేదు, క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు కూడా జరగలేదు. కిమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఇదంతా జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మండిపడుతోంది. కోవిడ్ సమస్యను అధిగమించేందుకు కిమ్ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే లక్షలాది జనాల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసినట్లయ్యింది. సరే ప్రపంచదేశాలకు కిమ్ ఎలాంటి అభిప్రాయమున్నా లక్షలాదిమంది బాధితులు, దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు నార్త్ కొరియా అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నారట. బయటదేశాలను అనుమతిస్తే సహాయ చర్యలు తీసుకునే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారట. మరి కిమ్ ఏమంటారో చూడాలి.