Begin typing your search above and press return to search.

వేల కేసులతో స్కూళ్ళా ?

By:  Tupaki Desk   |   16 Jan 2022 12:30 PM GMT
వేల కేసులతో స్కూళ్ళా ?
X
కరోనా మూడవ దశ ఏపీలో వణికించే నంబర్లను నమోదు చేస్తోంది. కేవలం వారం రోజుల్లోనే పది రెట్లు కేసులు పెరిగాయి. గత కొన్ని నెలలుగా వేయి లోపు ఉండే కేసులు ఇపుడు రోజుకు అయిదు వేలకు ఎగబాకాయి. ఇది ఇంకా తక్కువ నంబరే అసలు ఫిగర్ కొద్ది రోజుల్లో చూడాలి అని నిపుణులు అంటున్నారు. సంక్రాంతి పండుగ వేళ అంతా బాగా కలియతిరిగారు. దాంతో ఏపీలో కేసులు రానున్న రోజుల్లో మరింతగా పెరగడం ఖాయమే అని హెచ్చరిస్తున్నారు.

ఈ కీలక సమయంలో కరోనా ఆంక్షలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అయితే ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు అయిపోయాయి. యధా ప్రకారం ఈ నెల 17 నుంచి పాఠశాలలు మొదలవుతున్నాయి. దాంతో ఈ కేసులు మరింతగా పెరిగితే చిన్నారుల పరిస్థితి ఏంటి అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి. వారితో పాటు ఆయా కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు.

ఇక టీనేజర్లకు కరోనా టీకాలు కూడా అందరికీ పూర్తిగా వేయలేదు అని నివేదికలు చెబుతున్నాయి. దాంతో స్కూళ్ళు అంటేనే రిస్క్ అని భావించే సీన్ కనిపిస్తోంది. తెలంగాణాలో రోజుకు రెండు వేల కేసులు వస్తూంటే ఈ నెల 30 వరకూ పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవు పొడిగించారు. దానికి రెండున్నర రెట్లు ఏపీలో కేసులు నమోదు అవుతూంటే స్కూళ్ళు పెట్టడమేంటి అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రేపు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని కూడా నిలదీస్తున్నారు.

ఏపీలో యధా ప్రకారం స్కూళ్ళు ప్రారంభమవుతాయ‌ని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా ప్రకటించారు. దాంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు సినిమా హాళ్ళకు యాభై శాతం ఆక్యుపేషన్ పెట్టి పలు చోట్ల కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు కానీ చిన్నారుల ఆరోగ్యం విషయంలో కూడా చర్యలు తీసుకోవాలి కదా అన్న చర్చ అయితే వస్తోంది. మొత్తానికి మూడవ దశ కరోనా వేళ స్కూళ్ళు అంటే మాత్రం తల్లిదండ్రులు ముందు కలవరపడుతున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. చూడాలి మరి.