Begin typing your search above and press return to search.

ఉత్తర కొరియాలో కరోనా స్వైర విహారం.. కిమ్ ఏం చేస్తున్నాడు?

By:  Tupaki Desk   |   16 May 2022 2:08 AM GMT
ఉత్తర కొరియాలో కరోనా స్వైర విహారం.. కిమ్ ఏం చేస్తున్నాడు?
X
ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు వైరస్ ఆనవాళ్లు లేవని చెప్పుకున్న రాజ్యం ఇప్పుడు మహమ్మారి వ్యాప్తి తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. శనివారం మహమ్మారికి మరో 15 మంది బలైనట్టు ఆ దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2 లక్షల 96 వేల 180 మందిలో వైసర్ లక్షణాలతో కూడిన జ్వరాలను గుర్తించినట్లు కేసీఎన్ఏ పేర్కొంది.

దీంతో ఇప్పటి వరకు 8 లక్షల 20 వేల 620 మంది వైరస్ బారిన పడ్డారు. తొలి కరోనా కేసును గుర్తించినట్లు గురు వారమే ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన కేవలం మూడు రోజుల్లోనే కేసులు ఈ స్థాయి కి పెరగడం కలవరపరుస్తోంది. ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర కొరియా లో క్షేత్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థ దశాబ్దాలుగా చాలా బలహీనంగా ఉన్నాయి. పైగా మహమ్మారి ప్రవేశాన్ని నిలువరించడం లో భాగంగా ఆ దేశం విదేశాలతో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకుంది.

దీంతో వైరస్ ఆనవాళ్లు గుర్తించడానికి కావాల్సిన కనీస కిట్లు కూడా లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి భారీ ఎత్తున వ్యాప్తి చెందితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో వైపు ఉత్తర కొరియా ప్రభుత్వం మాత్రం మహమ్మారి వ్యాప్తి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వాధినేత కిమ్ జోంగ్ ఉన్ నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

దాదాపు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలన్ని రంగంలోకి దింపినట్లు పేర్కొంది. వీరంతా ప్రజల్లో లక్షణాలను గుర్తించి పరీక్షలు చేయడం, జనాల్లో వైరస్ వ్యాప్తి పై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారని తెలిపింది.

అలాగే భారీ ఎత్తున ఐసోలేషన్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా అక్కడి ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో ఆంక్షల పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదంతా తీవ్ర ఆహార, ఆరోగ్య, సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉత్తర కొరియా వ్యాక్సిన్లు సహా మహమ్మారి అదుపునకు కావలసిన ఇతర సాయాన్ని అందించడానికి చైనా, దక్షిణ కొరియా ముందుకు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు కిమ్ సర్కారు మాత్రం వాటిని అంగీకరించడానికి అధికారికంగా ముందుకు రాలేదు.