Begin typing your search above and press return to search.

చితి చ‌ల్లార‌ని శ్మశానాలు.. భయం గుప్పిట జ‌నం!

By:  Tupaki Desk   |   23 April 2021 1:30 AM GMT
చితి చ‌ల్లార‌ని శ్మశానాలు.. భయం గుప్పిట జ‌నం!
X
క‌రోనా మ‌రోణాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వారం కింద‌టి వ‌ర‌కూ ఓ మోస్త‌రుగా ఉన్న ప‌రిస్థితి.. ఇప్పుడు వేగంగా క్షీణిస్తోంది. కేసులు వేలాదిగా పెరుగుతుండ‌డంతోపాటు.. మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో.. శ్మ‌శానాలు క‌రోనా రోగుల శ‌వాల‌తో నిండిపోతున్నాయి. అందుబాటులో ఉన్న చోట ఎల‌క్ట్రిక్ మిష‌న్ల ద్వారా ద‌హ‌నం చేస్తుండ‌గా.. లేని చోట్ల క‌ట్టెల మీద‌నే కాల‌బెడుతున్నారు.

విజ‌య‌వాడ‌లో నిన్న ఒక్క రోజే దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారని స‌మాచారం. మృత‌దేహాల‌ను ఇళ్ల‌కు తీసుకెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో.. న‌గ‌రంలోని శ్మ‌శానాల్లోనే ద‌హ‌నం చేస్తున్నారు. శ‌వాల సంఖ్య పెరిగిపోతుండ‌డంతో.. ఒక చితి చ‌ల్లార‌క‌ముందే.. మ‌రొక‌టి వెలుగుతోంది. ఈ ప‌రిస్థితి చూసి స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఇటు, కుటుంబ స‌భ్యుల రోద‌న వ‌ర్ణ‌నాతీతంగా ఉంటోంది. క‌నీసం ద‌హ‌న సంస్కారాలు కూడా నిర్వ‌హించ‌లేక‌పోతున్నామ‌ని తీవ్రంగా దుఃఖిస్తున్నారు. ఆఖ‌రి చూపున‌కు సైతం నోచుకోలేక‌పోతున్నామ‌ని గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఈ ప‌రిస్థితి రానురానూ మ‌రింత ఎక్కువ‌వుతుండ‌డంతో.. రాబోయే రోజుల్లో ఎలా ఉంటోంద‌న‌ని తీవ్రంగా భ‌య‌ప‌డుతున్నారు.

అటు తెలంగాణ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే నిత్యం 5 నుంచి 6 వేల కేసులు న‌మోదు అవుతున్నాయి. బుధ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 1900 మంది చ‌నిపోయారు. ఆసుప‌త్రుల‌న్నీ రోగుల‌తో నిండిపోయాయి. కొత్త‌వారికి అవ‌కాశ‌మే లేకుండాపోయింది. దీంతో.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని జ‌నం వ‌ణికిపోతున్నారు.