కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్... మళ్లీ తెరమీదకు ఈ పాస్

Sun May 09 2021 22:00:01 GMT+0530 (IST)

Corona Second Wave Effect

కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతంలో మాదిరి కట్టడి చర్యలు ఒక్కటొక్కటిగానే అమల్లోకి వచ్చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఢిల్లీ కర్ణాటకలు ఇప్పటికే లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుండగా... నానాటికీ కేసులు పెరుగుతున్న ఏపీ కూడా అదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూను అమల్లోకి తీసుకువచ్చిన జగన్ సర్కారు... మున్ముందు ఏపీకి వచ్చే ఇతర రాష్ట్రాల వాసులకు ఈ పాస్ ను తప్పనిసరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఓ సంచలన ప్రకటన చేశారు.కరోనాను కట్టడి చేసే క్రమంలో ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చిన చర్యలను మరోమారు వల్లె వేసిన సవాంగ్... సోమవారం నుంచి మరికొన్ని షరతులను అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా తెలిపారు. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని ఆయన హెచ్చరించారు. కరోనాను కట్టడి చేసే క్రమంలో సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రయాణానికి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్టు ఆయన తెలిపారు. ‘అత్యవసర ప్రయాణికుల కోసం రేపట్నుంచి ఇ-పాస్ విధానం అమలు చేయనున్నాం. ఇ-పాస్ పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు అనుమతి లేదు. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉల్లంఘనలపై డయల్ 100 112నెంబర్లకు సమాచారం అందించాలి’  అని డీజీపీ అన్నారు.

కరోనా సెకెండ్ వేవ్ ఉధృతిని అదుపు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రతి రోజూ ఆరు గంటలు మాత్రం ...అది కూడా ఉదయం 6 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకు వ్యాపార సముదాయాలు ఇతరత్రా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కర్ఫ్యూ 18వ తేదీ వరకూ కొనసాగనుంది. అప్పటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.