Begin typing your search above and press return to search.

పొగరాయుళ్లకు కరోనా డేంజర్ బెల్స్

By:  Tupaki Desk   |   3 Aug 2020 11:30 PM GMT
పొగరాయుళ్లకు కరోనా డేంజర్ బెల్స్
X
ధూమపానం...గుట్కా...పాన్ మసాలా...మద్యపానం ఆరోగ్యానికి హానికరం.....మరియు ప్రాణాంతకం.....అని ప్రతి సినిమాకు టైటిల్ కార్డ్ పడడానికి ముందే చెబుతున్నా చాలామంది జనాలు మాత్రం మారడం లేదు....వాటిని సేవించడం మానడం లేదు. ధూమపానం చేసేవారు విడుదల చేసే పొగ పీల్చే వారికీ శ్వాసకోస సమస్యలు వస్తాయని చెప్పినా వినడం లేదు. అంతేకాదు, పొగ తాగనివాడు దున్నపోతై పుడతాడు అంటూ ఏదో పంచ్ డైలాగ్ కొట్టి మరీ పొగ ను ఊది వదిలేస్తున్నారు పొగ రాయుళ్లు.

ధూమపానం పై ప్రభుత్వం, సెలబ్రిటీల హెచ్చరికలను ఈ చెవి లో నుంచి విని .....ఆ చెవి లో నుంచి వదిలేస్తూ పెడ చెవిన పెడుతున్నారు. ఇక, ధూమపానం చేసేవారికి...కరోనాతో ముప్పు చాలా ఎక్కువని వైద్యులు, శాస్త్రవేత్తలు నెత్తినోరు బాదుకుంటున్నా పొగ రాయుళ్లు మాత్రం....ఊదడం ఆపడం లేదు. ఈ నేపథ్యం లోనే పొగ రాయుళ్లకు జాతీయ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కళ్లు బైర్లు కమ్మే వార్నింగ్ ఇచ్చింది.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే ధూమపానం అలవాటున్న వారికి కరోనా వైరస్‌ సోకితే నాలుగు రెట్లు ఎక్కువ ప్రమాదమని, వారితో పాటు ఆ పొగ పీల్చే వారి (పాసింగ్‌ స్మోకర్‌) పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరమేనని షాకింగ్ విషయాలు వెల్లడించింది. సాధారణంగా ధూమపానం చేసేవారిలో శ్వాసకోశ నాళాలు బలహీనమై ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిస్తుంది. మామూలుగానే ఊపిరితిత్తులపై దాడి చేసే కరోనా.....అటువంటి వారి ఊపిరి తిత్తుల్లో ప్రవేసిస్తే...తీవ్ర ఇబ్బందులు తప్పవని జాతీయ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వార్నింగ్ ఇచ్చింది.

కరోనా సోకి, శ్వాసకోశ సంబంధ లక్షణాలు తీవ్రమై మరణిస్తున్న వారిలో 63శాతం మంది ధూమపానం చేసేవారే ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విశ్లేషించింది. అందుకే, ధూమపానం, హుక్కా, ఇతరత్రా మార్గా ద్వారా పొగ పీల్చే అలవాటును మానుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. నీరసం పోయి హుషారు వచ్చేందుకు...చాలా మంది పొగ తాగేందుకు మొగ్గు చూపి దెబ్బ తింటున్నారని, వారిలో క్రమంగా రోగ నిరోధక శక్తి క్షీణించి క్యాన్సర్, షుగర్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు దాడి చేస్తాయని చెబుతోంది. ఆ వ్యాధులున్న వారు జాతీయ స్థాయిలో దాదాపు 10శాతం మంది హైరిస్క్‌ లోకి వెళ్తున్నారని గుర్తించింది. గుట్కా, ఖైనీ, పాన్, జర్దా తినే వారు బహిరంగం గా ఉమ్మివేసి కరోనా వ్యాప్తికి కారకులయ్యే అవకాశం ఉందని తెలిపింది.