Begin typing your search above and press return to search.

కరోనా మృతదేహాలు..15 నెలల నుంచి ఆస్పత్రిలోనే!

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:08 AM GMT
కరోనా మృతదేహాలు..15 నెలల నుంచి ఆస్పత్రిలోనే!
X
మానవత్వం మంటగలుస్తోంది. చనిపోయిన మృతదేహాలకు కనీసం అంత్యక్రియలు చేయాలన్న కనీస ఇంగితజ్ఞానం లేకుండా పోయింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలు 15 నెలలుగా మార్చురీలో కుళ్లిపోయిన దైన్యం వెలుగుచూసింది. ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్ష్యానికి ఈ ఘటన పరాకాష్టగా మారింది.

ప్రభుత్వాసుపత్రి మార్చురీలో రెండు శవాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను ఆస్పత్రి సిబ్బంది మార్చురీలోనే పడేసి మర్చిపోయారు. ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదిన్నరపాటు అవి మార్చురీలోనే ఉన్నాయి. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కరోనాతో మరణించినవారి మృతదేహాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి మార్చురీలో భద్రపరచాలి.

ప్రొటోకాల్ప్రకారం అంత్యక్రియలు జాగ్రత్తగా చేయాలి. కుటుంబ సభ్యులకు అనంతరం అప్పగించాలి. ఇవేమీ చేయకుండా ఏడాదిన్నరపాటు మార్చురీలోనే శవాలను పడేయడంతో అవి పూర్తిగా కుళ్లిపోయాయి.

కర్ణాటక బెంగళూరులోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో కుళ్లిన మృతదేహాలను గుర్తించిన ఘటనలో వెలుగుచూసింది. ఈ దారుణానికి కారణమైన హాస్పిటల్ డైరెక్టర్ జితేంద్రకుమార్ ను సస్పెండ్ చేశారు. అవి ఏడాదిన్నర క్రితం కరోనాతో మరణించిన రోగులవి అని గుర్తించారు. మృతుల్లో ఒకరి పేరు దుర్గా సుమిత్ర. మరొకరి పేరు మునిరాజు. 40 ఏళ్ల సుమిత్ర, 66 ఏళ్ల మునిరాజు కరోనా బారినపడ్డారు. వైద్యచికిత్స కోసం బెంగళూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేరారు. ఐతే చికిత్స పొందుతూ జులైలో మరణించారు. అనంతరం మృతదేహాలను మార్చురీకి తరలించారు.

ఆ తర్వాత బెంగళూరు కార్పొరేషన్ కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం మృతదేహాలను దహనం చేయాలి. లేదంటే కుటుంబ సభ్యులకు అప్పగించాలి. ఈ రెండూ చేయకుండా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేశారు. శవాలను మార్చురీలోపడేసారు. అంత్యక్రియలు పూర్తయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.

అయితే ఈ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆరు కోల్డ్ స్టోరేజీలున్నాయి. గత ఏడాది కోవిడ్ సమయంలో మరణాలు ఎక్కువ అవ్వడంతో కొత్త మార్చురీని నిర్మించారు. అందులోకి అన్ని మృతదేహాలను షిఫ్ట్ చేసి ఈ రెండు మృతదేహాలను మరిచిపోయారు. అలాగే వదిలేశారు. ఏడాదిన్నరగా ఫ్రీజర్ లోనే ఉండిపోయాయి. ఇటీవల పాతమార్చురీని శుభ్రం చేస్తున్న సమయంలో ఆ మృతదేహాలు బయటపడ్డాయి. పూర్తిగా కుళ్లిపోయాయి. దీనికి బాధ్యులైన ఆస్పత్రి డైరెక్టర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆ కుళ్లిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరీ ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? అని ఫ్యామిలీ మెంబర్స్ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.