Begin typing your search above and press return to search.

కరోనా కేసులకు కేరాఫ్ అడ్రస్ గా గురుకులాలు

By:  Tupaki Desk   |   4 Dec 2021 3:26 AM GMT
కరోనా కేసులకు కేరాఫ్ అడ్రస్ గా గురుకులాలు
X
ఈ ఏడాది మే- జూన్ తర్వాత నుంచి కరోనా కేసుల నమోదులో నేల చూపులు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో శుక్రవారం పలు కేసులు నమోదు కావటం కొత్త తలనొప్పిగా మారింది.

ఒక అంచనా ప్రకారం శుక్రవారం ఒక్కరోజులోనే గురుకులాల్లో 46 పాజిటివ్ కేసులు నమోదు కావటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద పల్లిలో 31 మందికి.. యాదగిరి గుట్టలో 10 మందికి పాజిటివ్ గా తేలటంతో ఉలికిపాటుకు గురయ్యే పరిస్థితి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికులు విద్యార్థులు అయితే.. ఉపాధ్యాయులు.. ఒక వంట మనిషికి కూడా పాజిటివ్ గా తేలింది.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులకు జలుబు.. తుమ్ములతో బాధ పడుతుండటంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా కరోనా పరీక్షలు చేయించారు. అనూహ్యంగా పది మందికి పాజిటివవ్ గా తేలింది. ఇదే జిల్లాలోని మల్యాల మండలంలోని ఒక గురుకులా పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా సోకింది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు మండలం ఇంద్రేశంలోని గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ గా బుధవారం తేలితే.. గురువారం మరో పాతిక మందికి పాజిటివ్ అన్న విషయం తేలింది. తాజాగా మరో 19 మందికి పాజిటివ్ గా తేలింది. అంతేకాదు.. సూర్యాపేట జల్లా ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులకు.. ఒక వంట మనిషికి పాజిటివ్ గా తేలింది.

ఇలా పలు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరి.. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.