మాటలన్న పట్టాభి సరే.. చేతలకు దిగిన వైసీపీ నేతల పరిస్థితి ఏంటి?

Fri Oct 22 2021 14:15:44 GMT+0530 (IST)

Controversy swirls around the YCP

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని కృష్ణా జిల్లా మచిలీపట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం 13రోజుల పాటు రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 7.45గంటలకు పోలీసులు ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం సబ్‌జైలుకు తీసుకువచ్చారు. తొలుత విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు 153(ఎ) 505(2) 353 504 రెడ్‌విత్ 120(బి) సెక్షన్లకు కింద కేసు నమోదు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పట్టాభి బెయిల్ పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాదులు శుక్రవారం దాఖలు చేయనున్నారు. పట్టాభిని ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కొవిడ్ పరీక్ష అనంతరం పోలీసు బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం తరలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వైసీపీకి ఉచ్చు బిగుస్తోంది. ఎందుకంటే.. సీఎంను దూషించిన నేరానికి పట్టాభిని అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. బాగానే ఉంది. మరి ఇదే సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయరా? అనే ప్రశ్న వైసీపీ ప్రభుత్వం చుట్టూ తిరుగుతోంది. తన వారికి ఒకలా.. ప్రతిపక్షానికి మరోలా న్యాయం .. చట్టం ఉంటాయా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఎందుకంటే.. పోలీసు అమరవీరుల దినోత్సవం రోజే... సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని తేల్చేశారు. అంతేకాదు.. తనవారైనా.. పొరుగువారైనా కూడా చట్టం... పోలీసులు ఒకే విధంగా స్పందించాలని ఆయన బహిరంగ వేదికపైనే వ్యాఖ్యానించారు. మరి దీనిని బట్టి.. టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించి.. గ్లాసులు పగలగొట్టిన సొంత వారిని ఏం చేస్తారనేది ప్రధాన ప్రశ్న. ఇప్పటి వరకు అంటే.. మూడు రోజులు గడిచినా.. ఏ ఒక్కరిపైనా కేసులు పెట్టింది లేదు. ఎవరినీ అదుపులోకి తీసుకుందీ లేదు. పైగా పోలీసులు ఇప్పటి వరకు టీడీపీ ఆఫీస్‌లో ఏం జరిగిందనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిది కూడా లేదు.

ఈ పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం చుట్టూ అన్ని వేళ్లూ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పట్టాభిని అరెస్టు చేయడాన్ని తప్పుబట్టకపోయినా.. దాడికి యత్నించిన వారిని వదిలేస్తే.. ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించిందనే వాదన ప్రచారంలోకి వస్తుంది. ఇది ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. సో.. ఇప్పటికైనా.. చర్యలు ప్రారంభించాలని.. అంటున్నారు పరిశీలకులు. ఇక దీనిపై టీడీపీ కూడా కామెంట్లు చేస్తోంది. కీలక నేతలు.. ఇప్పటికే.. పోలీసులకు ఫోన్లు చేసి.. తమ వారిని అరెస్టు చేశారు సరే.. మరి తమ కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలేస్తారా? అంటూ.. ఒత్తిళ్లు తెస్తున్నారు. రేపు కోర్టుకు కూడా వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా మొత్తంగా వైసీపీ ప్రభుత్వం ఉచ్చులో చిక్కుకుంటోందనే వాదన వినిపిస్తోంది.