Begin typing your search above and press return to search.

ఇదేంది నారాయణ? పండగపూట ఇలాంటి మాటలా?

By:  Tupaki Desk   |   15 Oct 2021 4:30 AM GMT
ఇదేంది నారాయణ? పండగపూట ఇలాంటి మాటలా?
X
త‌ర‌చుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. మీడియాలో ఉండే సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు నారాయ‌ణ‌.. మ‌రోసారి సెంట‌రాఫ్‌ది టాపిక్ అయ్యారు. ఆయ‌న ఏం మాట్లాడినా.. రాజ‌కీయంగా ప్రాధాన్యంతో పాటు.. ఇటీవ‌ల మీడియా కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ డం ప‌రిపాటిగా మారింది. ముందు అనేయ‌డం.. త‌ర్వాత‌.. స‌ర్దుబాటు చేసుకోవ‌డం.. ఒక్క నారాయ‌ణకే కాకుండా.. రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటుగా మారింద‌న‌డంలో సందేహం లేదు. అయితే.. ద‌స‌రా పండ‌గ రోజు కూడా సీపీఐ నారాయ‌ణ నోరు పారేసుకోవ‌డం.. లేనిపోని పోలిక‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వంపై కామెంట్లు చేయ‌డం .. వివాదానికి దారితీసింది.

గ‌తంలోనూ.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై.. నారాయ‌ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. `రోజా ఎలాంటిదైనా కానీ..` అంటూ.. నారాయ‌ణ చేసిన వ్యాఖ్య 2017లో తీవ్ర వివాదానికి కార‌ణమైంది. అప్ప‌ట్లో దీనిపై వివ‌ర‌ణ ఇచ్చిన నారాయ‌ణ త‌న సోద‌రి లాంటిద‌ని.. త‌న‌కు వేరే ఉద్దేశం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. మ‌రోసారి ఆయ‌న ఈ రేంజ్‌లో కాక‌పోయినా.. జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు సంధిస్తూ.. కొన్ని మాట‌లు తూలార‌నేది విమ‌ర్శ‌కుల భావ‌న‌. కొన్నాళ్లు వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న నారాయ‌ణ‌.. ద‌స‌రా పండ‌గ రోజు కూడా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు మాన‌లేదు.

ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌ని.. నారాయ‌ణ విరుచుకుప‌డ్డారు. సీఎం జ‌గ‌న్‌ను ధ‌ర్మ‌రాజుతో పోల్చారు. మ‌హాభార‌త కాలంలో ధ‌ర్మ‌రాజు కూడా ఇలానే అప్పులు చేశారంటూ.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధించారు. ఉన్న‌వాటిని తాక‌ట్టు పెట్టుకోవ‌డంతోపాటు.. రాబోయే ఆదాయాల‌పై కూడా అప్పులు చేయ‌డం.. జ‌గ‌న్‌కే చెల్లింద‌న్నారు. మ‌హాభార‌త కాలంలో ధ‌ర్మ‌రాజుకూడా ఇలానే అన్నీ తాక‌ట్టు పెట్టార‌ని.. నారాయ‌ణ చెప్పారు. ఇలా తాక‌ట్టు పెట్టి.. తాక‌ట్టు పెట్టి.. చివ‌ర‌కు భార్య‌ను కూడా తాక‌ట్టు పెట్టుకునే ప‌రిస్థితికి వ‌చ్చాడ‌ని.. నాటి ధ‌ర్మ‌రాజు సంగ‌తిని నారాయ‌ణ గుర్తు చేశారు.

ఇప్పుడు జ‌గ‌న్‌.. ధ‌ర్మ‌రాజులా పాల‌న అందించ‌డంలో త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ప‌రోక్షంగా చెబుతూనే.. మొత్తం ధ‌ర్మ‌రాజులాగా పాల‌న అందిస్తే.. క‌ష్ట‌మేన‌న్నారు నారాయ‌ణ‌. స‌గం-స‌గం ధ‌ర్మ‌రాజును అనుస‌రిస్తే.. మంచిదేన‌న్నారు. ఈ మేర‌కు తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో విజ‌య‌ద‌శ‌మి రోజు మీడియాతో మాట్లాడిన నారాయణ.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు.. విద్యుత్ సంక్షోభం.. డ్రగ్స్ మాఫియా అంశాలపై మాట్లాడారు. ఈ స‌మ‌యంలో త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యమంత్రి సహకారంతోనే ఏపీలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని.. ప్రతి కాంట్రాక్టుకు ఐదు శాతం కమిషన్ చేరుతుందన్న ఆయన.. కమిషన్ల వ్య‌వ‌హారాన్ని ఆధారాలతో నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీలో అధికార పార్టీ నేతల భూకబ్జాకు అడ్డూ అదుపు లేకుండాపోయిందన్నారు. అధికార పార్టీ నేతలు చేసే భూకబ్జాలకు రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారన్నారు. వైసీపీ నేతలకు సహకారాన్ని అందించిన ప్రభుత్వ ఉద్యోగస్తులంతా కచ్ఛితంగా జైలుకు వెళ్లే రోజు వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.