Begin typing your search above and press return to search.

వివాదాస్పద తీర్పులిచ్చిన జడ్జి రాజీనామా? ఒకరోజు ముందే ఎగ్జిట్

By:  Tupaki Desk   |   12 Feb 2022 6:21 AM GMT
వివాదాస్పద తీర్పులిచ్చిన జడ్జి రాజీనామా? ఒకరోజు ముందే ఎగ్జిట్
X
బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి పుష్ప గనేడివాలా చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇచ్చి చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన పదవీవిరమణకు ఒక్కరోజు ముందే తన పదవికి రాజీనామా చేసి కలకలం సృష్టించారు.అదనపు జడ్జిగా ఆమె పదవీకాలం ఇంకా ఒక రోజు మిగిలి ఉండగానే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

జస్టిస్ గనేడివాలా.. బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ లో అదనపు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2021 జనవరి, ఫిబ్రవరిలో లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి న్యాయమూర్తి హోదా కల్పించాలనే ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది.

అదనపు న్యాయమూర్తిగా ఆమె పదవీకాలాన్ని పొడగించడం.. పూర్తి స్థాయి హోదా కల్పించడం వంటి వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఫలితంగా న్యాయమూర్తి పుష్ప గనేడివాలాను 2022 ఫిబ్రవరి 12 తర్వాత అదనపు జడ్జి నుంచి జిల్లా సెషన్స్ జడ్జిగా డిమోట్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందుగానే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాకు ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

12 ఏళ్ల బాలిక ఛాతి భాగాన్ని ఓ వ్యక్తి తడమగా.. చర్మం తగలనందున దీనిని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని జనవరి 19న జస్టిస్ పుష్ప నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దుస్తుల మీద నుంచి శరీరభాగాలను తాకడం.. వేధింపులుగా పేర్కొనలేమని.. లైంగిక ఉద్దేశంతోనే బాలిక దుస్తులు తొలగించి లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగికవేధింపుల కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.

ఆ తర్వాత ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులోనూ జస్టిస్ పుష్ప ఇలాంటి తీర్పునే ఇచ్చారు. మైనర్ బాలికల చేతులు పట్టుకోవడం.. వారి ముందు పురుషుడు ప్యాంట్ జిప్ విప్పుకోవడం వంటివి లైంగిక వేదింపుల కిందకు రాదని తీర్పు వెలువరించారు.

దీన్ని పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను ఈ జడ్జి రద్దు చేశారు. ఈ తీర్పులు తీవ్ర దుమారం రేపడంతో జస్టిస్ పుష్పపై చాలా విమర్శలు వచ్చాయి.