ఒక నేతకు ఒక పదవికి మంగళం పాడిన కాంగ్రెస్

Fri Dec 02 2022 20:00:01 GMT+0530 (India Standard Time)

Congress set aside rule for Mallikharjuna Kharge

బీజేపీలోలాగానే కాంగ్రెస్ కూడా ఒక నేతకు ఒకే పదవి అని నియమం పెట్టుకుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే నియమం పెట్టుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే ప్రస్తుతం పార్లమెంట్ లోని రాజ్యసభలో విపక్ష నేతగా కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేతగా ఉన్నారు. దీంతో ఈయన ఒకే పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెట్టిన ఈ రూల్ కారణంగానే రాజస్థాన్ సీఎం పదవిని వదులుకోవడానికి అశోక్ గెహ్లాట్ ఇష్టపడలేదు.ప్రస్తుతం మల్లిఖర్జున ఖర్గేకు రెండు పదవులు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. రెండోది రాజ్యసభ పక్ష నేత పదవి. సో రెండు పదవుల్లో ఉన్న నేతను ఒకటే దాంట్లో కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ సందర్భంగా తన పదవికి రాజీనామా సమర్పించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభలో విపక్ష నేతగా తానే కొనసాగాలని ఖర్గే భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ గతంలో ఉదయ్ పూర్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వైదొలిగారు. తన ప్రత్యర్థి సచిన్ పైలెట్ ను సీఎం చేయడం ఇష్టం లేక ఈ పనిచేశారు. కాంగ్రెస్ లో రెండు పదవులుకు అవకాశమిచ్చి ఉంటే ఆయన రాజస్థాన్ సీఎంగా ఉంటూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వారు.

అయితే అశోక్ గెహ్లాట్ రెండు పదవులు నిర్వహించడాన్ని ఒప్పుకోని రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఖర్గేను రాజ్యసభలో విపక్ష నేతగా కొనసాగించేందుకు మాత్రం ఎలా అనుమతిస్తారన్న చర్చ మొదలైంది. దీనిపై కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.