Begin typing your search above and press return to search.

మునుగోడులో కాంగ్రెస్ కు షాక్.. బరిలోకి కోదండరాం టీజేఎస్

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:30 PM GMT
మునుగోడులో కాంగ్రెస్ కు షాక్.. బరిలోకి కోదండరాం టీజేఎస్
X
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డారు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం.. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ తో సాన్నిహిత్యం నెరిపారు. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల వేళ టీజేఎస్ అధినేత కోదండరాం.. కాంగ్రెస్ కు గట్టి షాకిచ్చారు. ఇన్నాళ్లు సాగిన వీరి బంధానికి బీటలు పడ్డాయి.

మునుగోడు ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు అవ్వడంతో టీజేఎస్ అధినేత కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పోటీలోకి దిగుతుండగా.. ఆ మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది.

ఆ మూడు పార్టీలు ఇప్పటికే మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లే బలమైన అభ్యర్థులను దింపుతాయని అనుకుంటే సడెన్ గా కేఏ పాల్ పార్టీ 'ప్రజాశాంతి' నుంచి ప్రజా యుద్ధనౌక గద్దర్ పోటీలోకి దిగడం సంచలనమైంది. ఇదే ఆశ్చర్యపరిస్తే.. తాజాగా ప్రొఫెసర్ కోదండరాం నేృత్వంలోని తెలంగాణ జనసమితి (టీజేఎష్) కూడా మునుగోడు పోటీలోకి దిగనుంది. ఈ విషయాన్ని కోదండరాం స్వయంగా ప్రకటించడం గమనార్హం.

రెండు, మూడు రోజుల్లో టీజేఎస్ అభ్యర్థిని ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. బీఆర్ఎస్ తో ఒరిగేది ఏమీ లేదని.. పేరు మార్చడం పెద్ద మోసమని ఆరోపించారు. తమ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటి తర్వాతే జీతం తీసుకోలేదని.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదంటూ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలకు ముందుగాల సమాధానాలు చెప్పాలని కోదండరాం ప్రశ్నించారు.

ఇక మునుగోడులో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోదండరాంను టీపీసీసీ నేతలు కోరారు. టీఆర్ఎస్, బీజేపీని ఓడించేందుకు టీజేఎస్ పోటీ నుంచి తప్పుకోవాలని.. తమకు మద్దతు ప్రకటించాలని కోదండరాంను గతంలో కోరారు. కానీ మద్దతు ఇవ్వడంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం టీకాంగ్రెస్ నేతలకు గతంలో సూచించారు. ఒక దశలో కోదండరాం మునుగోడులో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా టీజేఎస్ బరిలోకి దిగనుండడం కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చినట్టేనని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.