మోడీని సూపర్ హీరోను చేసి.. కాంగ్రెస్ ను విలన్ చేస్తున్న ‘న్యూ ఇండియా’ పోస్టులు

Thu May 26 2022 11:00:35 GMT+0530 (IST)

Congress Social Media viral News

మీడియాను క్రాస్ చేసిన సోషల్ మీడియాతో లాభంతో పాటు నష్టం కూడా ఉంది. నిజాల్ని నిర్భయంగా వెల్లడించటానిిక ఎంత అవకాశం ఉందో.. అబద్ధాల్ని అంతే అందంగా ప్రచారం చేసుకోవటానికి అంతే వీలు ఉంటుంది. ఎవరెంత వాడుకుంటారో అంత వాడుకునే అవకాశాన్ని సోషల్ మీడియా ఇస్తుంటుంది.మీడియాలో కొన్ని సెక్షన్ల విషయంలో ఇంతకాలం వ్యవహరించిన తీరును ప్రశ్నించే అవకాశం సోషల్ మీడియా పుణ్యమా లభిస్తోంది. అదే ఇప్పుడు ప్రధాని మోడీని తిరుగులేని హీరోగా నిలుపుతుంటే.. అదే సమయంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ ను జీరోగా మారుస్తున్నాయి.తాజాగా అలాంటి పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కశ్మీర్ వేర్పాటు నేత యాసిన్ మాలిక్ మీద ఉన్న నేరారోపణలు.. అతడి మీద ఉన్న కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి మీద చర్యల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నది లేదు. ఆ మాటకు వస్తే.. ఆ విషయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయి. కశ్మీర్ లో హిందూ పండిట్లను నరమేధానికి పాల్పడిన ఉదంతంలో అతడి సంస్థకు కీలక పాత్రను పోషించిందని.. ఆ రక్తచరిత్రలో యాసిన్ మాలిక్ పాత్ర ఉందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.


అలాంటి యాసిన్ మాలిక్ మీద చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ చేయలేకపోయింది. అయితే.. అందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరిన కొంతకాలానికే యాసిన్ మాలిక్ ను అరెస్టు చేయటంతో పాటు..ఆయనపై నమోదైన కేసుల విచారణను చేపట్టారు.

తాజాగా అతడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు.. రూ.10లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఇదంతా మోడీ ప్రభుత్వం కారణంగానే జరిగిందన్నఅర్థం వచ్చేలా పోస్టులు ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి.

నయా ఇండియా పేరుతో మోడీని సమర్థిస్తూ.. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించేలా పోస్టులు కాంగ్రెస్ కు ఇప్పుడు పెద్ద దెబ్బగా మారిందని చెప్పాలి. గతంలో ఇదే యాసిన్ మాలిక్ ను నాటి ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ కలవటం లాంటివి చేయటాన్ని తాజాగా ప్రశ్నిస్తున్నారు. ఏమైనా.. సోషల్ మీడియాలోని కొన్ని పోస్టులు మోడీని తిరుగులేని హీరో ఇమేజ్ ను తెచ్చి పెడుతుంటే.. అదే సమయంలో కాంగ్రెస్ కు మాత్రం కోలుకోలేని దెబ్బలు పడుతున్న పరిస్థితి. చేసిన తప్పులకు మూల్యం చెల్లించాలని చెప్పేది అందుకేనేమో?