Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరిన కూన.. కాంగ్రెస్​ జాతకం బయటపెట్టేశాడు..!

By:  Tupaki Desk   |   22 Feb 2021 4:05 AM GMT
బీజేపీలో చేరిన కూన.. కాంగ్రెస్​ జాతకం బయటపెట్టేశాడు..!
X
కాంగ్రెస్​ సీనియర్​ నేత, కుత్బుల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్​ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కూన పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఓ వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆయన ఏమన్నారంటే.. ‘మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. 2009లో కాంగ్రెస్​ టికెట్​ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్​గా గెలిచి కాంగ్రెస్​లో చేరా. కీలక సమయంలో కాంగ్రెస్​ పార్టీని కాపాడాను.

అయితే ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీ అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు కొత్త వ్యక్తిని నియమించుకోలేకపోయిందటే ఆ పార్టీ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014, 18 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్​కు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ప్రజల తరఫున పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. అందుకు కారణం నాయకత్వ లోపమే. ఆ పార్టీని ఇప్పుడు ఎవరూ కాపాడలేరు’ అంటూ ఆయన ఫైర్​ అయ్యారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్​ ఎస్​ ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నని.. అయితే కాంగ్రెస్​ పార్టీ .. టీఆర్​ఎస్​ అక్రమాలపై కాంగ్రెస్​ పోరాటం చేయలేకపోతున్నదని చెప్పారు. టీఆర్​ ఎస్​ తో పోరాడే శక్తి బీజేపీ కి మాత్రమే ఉన్నదని కూన శ్రీశైలం గౌడ్​ అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా బీజేపీనే నమ్ముతున్నారని చెప్పారు. ఇటీవల వచ్చిన జీహెచ్​ఎంసీ, దుబ్బాక ఎన్నికల ఫలితాలనే ఇందుకు నిదర్శనమని చెప్పారు.