Begin typing your search above and press return to search.

ఈవీఎంల హ్యాకింగ్.. మ‌ళ్లీ కాంగ్రెస్ గోల? న‌మ్మాలా?

By:  Tupaki Desk   |   23 Jan 2020 8:37 AM GMT
ఈవీఎంల హ్యాకింగ్.. మ‌ళ్లీ కాంగ్రెస్ గోల? న‌మ్మాలా?
X
భార‌త లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు వాడిన ఈవీఎంలు హ్యాక్ అయ్యాయ‌నే అంశాన్ని మ‌రోసారి నెత్తికి ఎత్తుకుంటున్న‌ట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్ప‌టికీ ఈ విష‌యంపై ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ అభ్యంత‌రం చెప్పిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఈవీఎంల‌తో ఎన్నిక‌లు వ‌ద్దంటూ గోల గోల చేశారు. ఎన్నిక‌ల్లో ఆ పార్టీలు చిత్తు అయ్యాయి. అయితే ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు ఈ అంశాన్ని ఎత్త‌డం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం మ‌ళ్లీ ర‌చ్చ చేయ‌బోతోంద‌ట‌!

ఈవీఎంల‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని స‌య్య‌ద్ షుజా అనే వ్య‌క్తి చూపించాడ‌ట‌. ఈయ‌న ఈసీఐఎల్ లో పని చేశాడ‌ట‌. అక్క‌డే ఈవీఎంల హ్యాకింగ్ కు బీజం ప‌డింద‌ట‌. అలా ఈయ‌న‌కు ఆ విష‌యం తెలుస‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న దేశంలో కూడా లేడు. అమెరికాలో త‌ల‌దాచుకుంటున్నాడ‌ట‌. ఈ నేఫ‌థ్యంలో అక్క‌డే.. ఇత‌డు ఇండియ‌న్ ఈవీఎంల‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని నిరూపించాడ‌ట‌. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ టేక‌ప్ చేస్తోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ అంశాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్తుంద‌ట కాంగ్రెస్ పార్టీ.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా విభాగాలు ఈ వాద‌న వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక టీడీపీ శ్రేణులు ప్ర‌చారాన్ని మ‌ళ్లీ మొద‌లుపెట్టాయి.

అయితే ఈవీఎంల విష‌యంలో ఈ ఆరోప‌ణ‌లు కొత్త కాదు. తాము గెలిచిన‌ప్పుడు వివిధ పార్టీ లు ఆ వాద‌న‌ను ఒప్పుకోవు. అయితే ఓడిన‌ప్పుడు మాత్రం ఈవీఎంల మీద నెపం నెడుతూ ఉంటాయి. అలాగే 2014లోనే ఈవీఎంల ట్యాంప‌రింగ్ జ‌రిగిందని షుజా చెబుతున్నార‌ట‌. ఆ విష‌యం నాటి బీజేపీ నేత గోపినాథ్ ముండేకు తెలుస‌ట‌. అందుకే ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యాడ‌ట‌. కానీ గోపినాథ్ ముండేది ప్యూర్ యాక్సిడెంట్ అని అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. అలాంటిది ఇప్పుడు గోపినాథ్ ముండే మ‌ర‌ణానికి, ఈవీఎంల హ్యాకింగ్ కు ముడిపెట్ట‌డం విడ్డూరంగా ఉంది. అయితే తెలుగుదేశం సోష‌ల్ మీడియా విభాగానికి మాత్రం ఇదో అంశంగా దొరుకుతూ ఉంది. ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఓట‌మిని త‌క్కువ చేసి చూప‌డానికి ఇలాంటి అంశాల‌ను వాడుకుంటున్న‌ట్టుగా ఉన్నారు.