Begin typing your search above and press return to search.

మోడీ ఇమేజ్ ను స్మాష్ చేసేలా కాంగ్రెస్ ఎంపీ పంచ్..

By:  Tupaki Desk   |   10 Aug 2022 4:52 AM GMT
మోడీ ఇమేజ్ ను స్మాష్ చేసేలా కాంగ్రెస్ ఎంపీ పంచ్..
X
దేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని చర్చించటంతో పాటు పాలనా పరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు.. తీసుకుంటున్న నిర్ణయాల్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో పార్లమెంటరీ వ్యవస్థ ఒకటి. అందునా.. పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశ ప్రధాని క్రమం తప్పకుండా హాజరవుతూ..సభ్యులు లేవనెత్తిన అంశాల్ని వినటం ద్వారా.. మరింత మెరుగైన పాలనను అందించే వీలు ఉంటుంది.

అందుకు భిన్నంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరు కాకుండా ఉంటున్న వైనంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్ తాజాగా అదిరే పంచ్ విసిరారు.

ఒక పుస్తకావిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొన్న శశిథరూర్.. ప్రధాని మోడీ తీరును తనదైన శైలిలో వ్యంగ్యోక్తిని విసిరి నవ్వులు పూయించారు. అదే సమయంలో మోడీ చూస్తున్న తప్పును తనదైన శైలిలో చెప్పేశారు.

పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోడీ గైర్హాజరు ఎక్కువగా ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. "మన పార్లమెంటులో కన్నా విదేశీ పార్లమెంటులోనే మోడీ ఎక్కువగా మాట్లాడతారు' అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన పంచ్.. పర్ ఫెక్టుగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఆయన తాజా పంచ్ మోడీ ఇమేజ్ ను ఖరాబు చేసేలా ఉందని చెబుతున్నారు.

ప్రజాస్వామ్యం.. ప్రజాస్వామ్య సంస్థలు.. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో దేశ తొలి ప్రధాని నెహ్రు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీల పని తీరును పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. నెహ్రుకు విరుద్దంగా మోడీ దేశీయ పార్లమెంటులో కంటే విదేశీ పార్లమెంటులోనే ఎక్కువ ప్రసంగాలు చేశారన్నారు. 1962లో భారత్ - చైనాయుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి సంబంధిత సమస్యపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇప్పుడు సరిహద్దు సమస్యలపై ప్రశ్నించటానికి వీల్లేని పరిస్థితి ఉంది. గల్వాన్ లోయలో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు లేకుండా పోయిందన్న ఆయన.. అక్కడ జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. లోక్ సభ.. రాజ్యసభల్లో మాత్రం చర్చ జరగని వైనాన్ని ఎత్తి చూపారు. శశిథరూర్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.