Begin typing your search above and press return to search.

ఫేస్‌బుక్‌ లో పోస్ట్ .. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు !

By:  Tupaki Desk   |   12 Aug 2020 4:30 AM GMT
ఫేస్‌బుక్‌ లో పోస్ట్ .. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు !
X
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద వివాదానికి కారణం అయింది. తూర్పు బెంగళూరులోని కావల్ బైర్సాండ్రా ప్రాంతంలోని పులకేషినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి బంధువు ఒకరు ఫేస్ బుక్ లో అవమానకర పోస్ట్ పెట్టారు అని ఆయన ఇంటి వద్ద వందలాది మంది రాళ్ళు రువ్వారు. అక్కడ నిలిపిన కార్లకు కూడా నిప్పంటించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నాలు చేస్తే ఆ కాల్పుల్లో ఇద్దరు అక్కడే మరణించారు. కొందరికి గాయాలైయ్యాయి. దీనితో మరింతగా రెచ్చిపోయిన ఆందోళన కారులు .. పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసుల్లో దాదాపుగా 60 మంది వరకు గాయాల పాలైయ్యారు.

పూర్తి వివరాలు చూస్తే .. అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఉన్న ఈ పోస్ట్‌ ను చూసిన వెంటనే వందలాది మంది ఈ దాడికి పాల్పడ్డారు. కావల్ బైరసంద్ర, కేజీ హళ్లి ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో అక్కడ స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని , ఆ ఆందోళనను నియంత్రించడానికి ప్రయత్నలు చేశారు. కానీ , వారు అదుపులోకి తీసుకురాలేకపోవడంతో మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ.. వారు అదుపులోకి రాలేదు. దీనితో నేరుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.

కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. కేజీ హళ్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. పోలీస్ స్టేషన్ బయట పార్క్‌ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. నిప్ను పెట్టారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. వారిని తరిమి కొట్టారు. కేజీ హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. దాడి జరిగినప్పుడు ఎమ్మెల్యే తన నివాసంలో లేరని తెలిసింది. బెంగళూరు పోలీసు కమీషనర్ కమల్ కాంత్ మాట్లాడుతూ… కర్ణాటకలోని బెంగళూరులోని డిజె హల్లి & కెజి హల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో జరిగిన సోషల్ మీడియా పోస్టుపై జరిగిన ఘర్షణల్లో అదనపు పోలీసు కమిషనర్ సహా 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని మీడియాకు తెలిపారు.