Begin typing your search above and press return to search.

ఓటుకునోటు ప్రస్తావనతో రేవంత్ ను కెలికేసిన జగ్గారెడ్డి

By:  Tupaki Desk   |   3 July 2022 12:12 PM GMT
ఓటుకునోటు ప్రస్తావనతో రేవంత్ ను కెలికేసిన జగ్గారెడ్డి
X
కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో బయటపడిన ఓటుకునోటు కేసు దేశంలో ఎంతో సంచలనం సృష్టించింది. ఆకేసులో వీడియో సాక్ష్యాధారాలతో సహా దొరికింది అప్పటి టీడీపీ ఎంఎల్ఏ ఇప్పటి తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే. ఆ కేసులో రేవంత్ పై అప్పట్లోనే ఏసీబీ కేసు నమోదుచేసి కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండులో కూడా ఉండొచ్చారు. ఆ కేసు ఇంకా సుప్రింకోర్టులో విచారణలోనే ఉంది. అలాంటి కేసును ఇపుడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కెలికారు.

రేవంత్ టెంపర్మెంట్ ను ఉదాహరణగా ప్రస్తావిస్తు జగ్గారెడ్డి ఓటుకునోటు కేసును అందరికీ గుర్తుచేశారు. రేవంత్ దూకుడు వల్లే ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు తెలంగాణా వదలివెళ్ళాల్సొచ్చిందన్నారు. జగ్గారెడ్డి ఉద్దేశ్యం ఏమిటంటే చంద్రబాబును ప్రస్తావించటం కాదని రేవంత్ ను కెలకటమేనని స్పష్టంగా అర్ధమైపోతోంది. నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హా పర్యటనే తాజాగా గొడవకు కేంద్రమైంది.

సిన్హా శనివారం హైదరాబాద్ వచ్చారు. విమానాశ్రయంలో కేసీయార్ అండ్ కో స్వాగతం పలికారు. ఆ సమయంలో వీహెచ్ కూడా స్వాగతం పలికారు. దాంతో రేవంత్ కు మండిపోయింది. ముందు కేసీయార్ ను కలిసిన కారణంగా సిన్హాతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యేది లేదని చెప్పారట. దాన్నే జగ్గారెడ్డి తప్పుపట్టారు. పార్టీ నిర్ణయాన్ని థిక్కరించి సిన్హాను కలిసిన వీహెచ్ ను గోడకేసి కొట్టాలని రేవంత్ అన్నారు. దాంతో జగ్గారెడ్డి ఫుల్లుగా ఫైరయిపోయారు.

సీనియర్లు రేవంత్ ఇంట్లో నౌకర్లనుకున్నావా అంటు మండిపోయారు. వీహెచ్ ను పట్టుకుని గోడకేసి కొట్టాలనేంత స్ధాయా నీది ? అంటు రెచ్చిపోయారు. ఇలాంటి టెంపర్మెంట్ ఉన్న వ్యక్తి పీసీసీ అద్యక్షుడిగా పనికిరాడని జగ్గన్న తేల్చేశారు. అలాగే ఇలాంటి టెంపర్మెంట్ వల్లే ఓటుకునోటు కేసులో కూడా రేవంత్ ఇరుక్కున్నాడంటు కెలికేశాడు. దాంతో జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలపై రేవంత్ ఎలా స్పందిస్తారు ? దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.