Begin typing your search above and press return to search.

రాహుల్ రాంగ్ కాన్సెప్ట్ : దేశమంటే దేశమేనోయ్ జూనియర్ గాంధీ

By:  Tupaki Desk   |   15 May 2022 11:30 PM GMT
రాహుల్ రాంగ్ కాన్సెప్ట్ : దేశమంటే దేశమేనోయ్  జూనియర్ గాంధీ
X
కాంగ్రెస్ అధినాయకుడు, భావి ప్రధాని రాహుల్ గాంధీ దేశం గురించి తన అభిప్రాయాన్ని చింతన్ శిబిర్ ముగింపు సందర్భంగా చెప్పుకున్నారు. తన ఆలోచనలను విప్పి చెప్పుకున్నారు. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని మహాకవి గురజాడ అన్నారు. కానీ మన రాహుల్ జీ మాత్రం దేశమంటే రాష్ట్రాలే అంటున్నారు. ఈ మాట ఆయన ఇంతకు ముందు కూడా అన్నారు.

రాష్ట్రాల సమాఖ్య దేశమని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలు ఉంటేనే దేశం ఉందని అని అన్నారు. రాష్ట్రాల కలయికతోనే దేశమని కూడా పేర్కొన్నారు. కానీ నిజానికి దేశమంటే దేశమే. భారత దేశం అన్నది ప్రాచీన కాలం నుంచి ఉంది. నాడు కూడా చిన్న రాజ్యాలు, రాజులు ఉన్నారు. ఎక్కడికక్కడ పాలన ఉన్నా అన్నింటికీ కలిపి ఉంచే ఒక దారంగా ఆధారంగా దేశం ఉంది.

అది మూడు వేల సంవత్సరాల క్రితం వెనక్కు వెళ్తే భారత దేశం ఎంతో బలమైనది అని చరిత్ర చెబుతుంది. ఈ సువిశాలా దేశాన్ని ఏలిన మహా చక్రవర్తులు ఉన్నారు. భారత దేశం ఆసేతు హిమాచలం ఎపుడూ ఉంది. ఇక ఎన్ని రాజ్యాలు ఉన్నా దేశంగా ఒక్కటిగానే భారత్ అన్నది పురాణాలలోనూ ఉంది.

ఎందుకంటే బలమైన బంధం దేశం. రాష్ట్రాలు విడివిడిగా ఎంతలా బలంగా ఉన్నా దేశం అనే చట్రంలో ఇమడకపోతే మాత్రం వాటికి అస్థిత్వం ఉండదు. ఇదే భారత దేశం వేల ఏళ్ళుగా కలసి ఉండడానికి బలంగా ఈ రోజుకీ ప్రపంచంలో సత్తా చాటుకోవడానికి కారణంగా ఉంది

కానీ రాహుల్ గాంధీ మాత్రం ఉల్టాగా చెబుతున్నారు. రాష్ట్రాల సమాఖ్య చేశామని అంటున్నారు. రాష్ట్రాలు లేకపోతే దేశం లేదని ఆయన అంటున్నారు. ఇక్కడ ఆయన తన నానమ్మ ఇందిరమ్మ ఆలోచనలను కూడా కాదన్నట్లుగా వైఖరి ఉంది. ఇందిరాగాంధీ అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా ఉన్నారు.

ఆమె పటిష్టమైన దేశాన్ని కోరుకున్నారు. రాష్ట్రాలు బలంగా ఉన్నా అంతకంటే బలమైన దేశం ఉండాలని ఆమె ఆకాక్షించారు. ఈ రోజు కేంద్రంలో బలమైన ప్రభుత్వంగా మోడీ సర్కార్ ఉంది. దాంతో రాహుల్ వంటి వారు కేవలం రాజకీయ కారణాలతోనే సమాఖ్య రాగాన్ని ఆలపిస్తున్నారు అని అంటున్నారు.

మరి ఇది దేశాన్ని బలహీనం చేసే భావన. కాంగ్రెస్ వంటి పురాతమైన పార్టీకి నాయకుడుగా ఉన్న రాహుల్ జీకి ఈ భావన అసలు కలిగి ఉండరాదు. కానీ ఎందుకో ఆయన రాజకీయమే చూసుకుని ఈ కామెంట్స్ ని తరచూ చేస్తున్నారు. సో. ఇది రేపటి రోజున ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కే ఇబ్బందిగా మారుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.