Begin typing your search above and press return to search.

రాజశేఖర్ రెడ్డి అడుగుల్లో.. రాహుల్ పాదయాత్ర? కశ్మీర్ టు కన్యాకుమారి.. మంచి 'స్టెప్పే'

By:  Tupaki Desk   |   15 May 2022 9:42 AM GMT
రాజశేఖర్ రెడ్డి అడుగుల్లో.. రాహుల్ పాదయాత్ర? కశ్మీర్ టు కన్యాకుమారి.. మంచి స్టెప్పే
X
ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. విభజనకు కొద్ది ముందుగా చంద్రబాబు నాయుడు.. 2017లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అందరిలో కామన్ పాయింట్ ఎన్నికలకు ముందు పాదయాత్ర. ఆ తర్వాతి ఎన్నికల్లో విజయ యాత్ర. ఇప్పుడిదే అంశాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫాలో కాబోతున్నారా..? పార్టీకి పూర్వవైభవమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న చింతన్ శిబిరంలో ఆదివారం ఇదే అంశం హాట్ టాపిక్ అయింది. 'నవసంకల్ప చింతన శిబిరం'లో ఈ కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా భారీ పాదయాత్ర నిర్వహించాలని ఓ కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం.

దేశం ఆసాంతం.. కీలక సమస్యతో గతంలో ఏదైనా సందర్భంలో భారత దేశం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటారు. ఇప్పుడు ఈ కశ్మీర్-కన్యాకుమారి మధ్య రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. అందులోనూ నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ ఈ పాదయాత్రను కొనసాగించాలని చింతన్ శిబిరంలో'సస్టెయిన్డ్‌ అజిటేషన్‌ కమిటీ'ప్రతిపాదించినట్లు తెలిసింది.

అయితే, దేశవ్యాప్త పాదయాత్రకు కేవలం ఏడాది వ్యవధినే నిర్దేశించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనే పాదయాత్రకు సుదీర్ఘ సమయం పట్టింది. వైఎస్ దాదాపు మూడు నెలలు 1,475 కిలోమీటర్లు పాదయాత్ర సాగించారు. జగన్ 14 నెలలు 2,500 కిలోమీటర్లు పైగా 125 నియోజకవర్గాల్లో తిరిగిరారు.

అయితే, రాహుల్ కు దేశవ్యాప్త పర్యటనకు ఏడాది సరిపోతుందా? అనేది ప్రశ్నార్థకం. కాగా , ఈ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ సహా సీనియర్ నాయకులు మధ్య మధ్యలో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు. దీనిపై ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌ సింగ్‌ పూర్తిస్థాయి ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై లోతైన చర్చ కూడా జరిగినట్లు తెలిపారు.

జనతా దర్బార్ పేరిట ప్రత్యేక సభలు జగన్.. తన పాదయాత్రలో ఎక్కడికక్కడ బహిరంగ సభలు నిర్వహించారు. మండుటెండలోనూ చెక్కు చెదరకుండా నిలిచారు. విపరీతమైన ఏపీ వేడిలోనూ ప్రసంగాలు చేస్తూ వచ్చారు. ఇలానే కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యేందుకు ఈ తరహా కార్యక్రమాన్నే యూత్‌ కమిటీ కూడా సూచించినట్లు సమాచారం.

ఈ పాదయాత్రలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో 'జనతా దర్బార్‌' పేరిట భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్యక్రమాలు దాదాపు ఖాయమైనట్లేనని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై ప్యానళ్ల కన్వీనర్లు అధినేత్రి సోనియాగాంధీకి నివేదికలు సమర్పించారు.

కష్ట కాలంలో మంచి స్టెప్పే.. మరి ఆచరణ? వాస్తవానికి కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. సమస్యల పరిష్కర్తలుగా పేరున్నవారే సమస్యలుగా మారారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారం లేదు. జాతీయ స్థాయి సారథ్యానికి ఆ పార్టీని నమ్మని వైనం. అన్నిటికి మించి మోదీ కరిష్మాను తట్టుకోవాలి. బలమైన బీజేపీని అంతే బలంగా ఎదుర్కోవాలి. ఇలాంటి సమయంలో పునరుజ్జీవనం అంటే ఓ మహా ప్రయత్నం జరగాల్సిందే.

రాహుల్ పాదయాత్ర వార్తలు నిజమే అయితే.. అది మంచి స్టెప్పే. కానీ, అదసలే కాంగ్రెస్ పార్టీ. ఎంత బలంగా కనిపిస్తుందో అంతే బలహీనం కూడా. అలాంటి పార్టీలో ఏదైనా జరగొచ్చు. రాహుల్ పాదయాత్ర కార్యాచరణ ఏమేరకు సాధ్యమో చూడాలి మరి? అన్నట్లు దేశవ్యాప్త పాదయాత్ర చేసిన నాయకలు కొద్దిమందే. వారిలో దివంగత ప్రధాని చంద్రశేఖర్ ఒకరు. 19843లో కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 4,260 కిలోమీటర్లు చంద్రశేఖర్ పాదయాత్ర సాగించారు.