ఎవరేమో కానీ.. తను మాత్రం గెలుస్తారట!

Wed May 22 2019 22:51:38 GMT+0530 (IST)

Congress Leader Komatireddy Venkatreddy Fire TRS Party

తెలంగాణలో తమ పార్టీ తరఫున పోటీ చేసిన వారి విజయాల గురించి తను ఎలాంటి  భరోసాను ఇచ్చేది ఉండదన్నట్టుగా తను మాత్రం ఎంపీగా కచ్చితంగా నెగ్గడం ఖాయమని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తన విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారీయన. భువనగిరి ఎంపీ గా వెంకట్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే.సరిగ్గా కొన్ని నెలల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆ ఓటమికి వెరవక ఆయన వెంటనే వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా ఎంపీగా బరిలోకి దిగారీయన. ఇలాంటి నేపథ్యంలో తన విజయం పట్ల ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఆ కాన్ఫిడెన్స్ ను కూడా తనదైన శైలిలో వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ దేశంలో సునాయాసంగా నెగ్గే సీట్లలో భువనగిరి ముందు ఉంటుందని ఆయన అన్నారు. తను కనీసం ఎనభై వేల నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో నెగ్గబోతున్నట్టుగా ఈ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రకటించుకున్నారు.

తెలంగాణలో మిగతా లోక్ సభ సీట్లలో ఎవరు నెగ్గుతారో ఎవరు ఓడతారు తను చెప్పేదేమీ ఉండదని. తను మాత్రం గెలవడం ఖాయమని.. ఈ విషయంలో భువనగిరి ప్రజలకు ధన్యవాదాలు అంటూ.. ముందుగానే ఓటర్లకు థ్యాంక్స్ కూడా చెప్పేశారు వెంకట్ రెడ్డి. ఈ విశ్వాసం ఎంత బలమైనదో మరి కొన్ని గంటల్లోనే స్పష్టత రాబోతోంది!