Begin typing your search above and press return to search.

జ‌గ్గారెడ్డికి వార్నింగ్‌.. అందుకే సైలెంట్‌!

By:  Tupaki Desk   |   20 Jan 2022 1:30 AM GMT
జ‌గ్గారెడ్డికి వార్నింగ్‌.. అందుకే సైలెంట్‌!
X
సంక్రాంతి ముగిసిన త‌ర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని క‌లుస్తాన‌ని.. పార్టీలో ప‌రిస్థితులు వివ‌రిస్తాన‌ని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హంతో హైక‌మాండ్‌కు ఫిర్యాదు చేసిన జ‌గ్గారెడ్డి ఇప్పుడు చ‌ల్లబ‌డ్డార‌ని తెలుస్తోంది. అధిష్ఠానం నుంచి వ‌చ్చిన ఆదేశాలే అందుకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

అధికార టీఆర్ఎస్, రాజకీయంగా ఎదుగుతున్న బీజేపీతో పోరాటం చేయాల్సిన రేవంత్ రెడ్డికి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తూ జగ్గారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రైతు వ్య‌వ‌తిరేక విధానాలు అవ‌లంబిస్తున్న కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. మొద‌ట‌గా కేసీఆర్ ద‌త్త‌త గ్రామం ఎర్ర‌వ‌ల్లిలోనే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌నుకున్నారు. కానీ పోలీసులు అడ్డుకోవ‌డంతో అది సాధ్యం కాలేదు.

మ‌రోవైపు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం గురించి త‌న‌కు క‌నీస స‌మాచారం ఇవ్వ‌లేద‌ని జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ వైఖ‌రి మార్చుకోవాల‌ని చెప్పాల‌ని లేనిప‌క్షంలో ఆయ‌న స్థానంలో వేరేవాళ్ల‌ను నియ‌మించాల‌ని అధిష్ఠానానికి ఆయ‌న ఫిర్యాదు చేశారు. దీంతో జ‌గ్గారెడ్డి కేసీఆర్ కోవ‌ర్ట్ అంటూ రేవంత్ వ‌ర్గం ఆరోపించింది. ఆ త‌ర్వాత పార్టీ స‌మావేశం కూడా వాడివేడిగా సాగింది. ఓ దశలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ జగ్గారెడ్డి కూల్ అయ్యారు.

సంక్రాంతి తరువాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి పరిస్థితులు వివరిస్తానని.. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకుండా కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే సంక్రాంతి తరువాత కూడా జగ్గారెడ్డి సైలెంట్‌గా ఉండటం చ‌ర్చ‌కు దారితీసింది. ఆయ‌న విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రచ్చకెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని.. తమకు అన్ని విషయాలు తెలుసని కాంగ్రెస్ నాయకత్వం జగ్గారెడ్డికి తేల్చి చెప్పిందని సమాచారం. అందుకే కొద్దిరోజుల క్రితం పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఆయ‌న ఇప్పుడు ఏం మాట్లాడ‌డం లేద‌ని ప్రచారం సాగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డికి చెక్ చెప్పే విషయంలో జగ్గారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉండి.. మళ్లీ టైమ్ చూసుకుని రేవంత్ రెడ్డిని ఇరుకునపెట్టేందుకు జగ్గారెడ్డి ప్రయత్నాలు చేయొచ్చనే వార్తలు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.