Begin typing your search above and press return to search.

కొల్లాపూర్ లో టీఆర్ఎస్ లో భ‌గ్గుమ‌న్న విభేదాలు!

By:  Tupaki Desk   |   25 Jun 2022 6:30 AM GMT
కొల్లాపూర్ లో టీఆర్ఎస్ లో భ‌గ్గుమ‌న్న విభేదాలు!
X
నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో తాజా, మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. 2018 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జూప‌ల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్య‌ర్థి బీరం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి చేతిలో ఓట‌మి చ‌విచూశారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ లో భాగంగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్ప‌టి నుంచి అటు జూప‌ల్లి కృష్ణారావు, బీరం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డిల మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంద‌నే చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది.

స‌హ‌జంగానే హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి టీఆర్ఎస్ లో చేర‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో పెత్త‌న‌మంతా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తోంద‌ని చెప్పుకుంటున్నారు. చివ‌ర‌కు అధికారులు సైతం ఆయ‌న చెప్పిన‌ట్టే న‌డుచుకుంటున్నార‌ని అంటున్నారు. గతంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన జూప‌ల్లి ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆయ‌న హ‌వా త‌గ్గింది. పార్టీ అధిష్టానం కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న స్త‌బ్దుగా మారిపోయార‌ని చెప్పుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో అటు మాజీ ఎమ్మెల్యే జూప‌ల్లి కృష్ణారావు, ఇటు ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి మ‌ధ్య స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు చోటు చేసుకుంటున్నాయి. నువ్వెంత అవినీతిపరుడవో.. నేనెంత అవినీతిపరుడనో తేల్చుకుందాం.. రా అని జూపల్లి కృష్ణారావు.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి స‌వాల్ విసిరారు. దీనికి బీరం కూడా సై అన‌డంతో కొల్లాపూర్ టీఆర్ఎస్ లో విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి.

ఇద్ద‌రి నేత‌ల అవినీతిపై చ‌ర్చ‌కు జూన్ 26న కొల్లాపూర్ పట్టణంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన ఇంటి నుండి భారీ ర్యాలీతో మాజీ మంత్రి జూపల్లి ఇంటి వరకు వెళ్లడానికి సిద్ధ‌మ‌య్యారు. ప్రజలు, పాత్రికేయుల సమక్షంలో చర్చించడానికి అనుమతి కావాలని ఎమ్మెల్యే అనుచరుడు జంబులయ్యా ఎస్పీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు నేత‌ల స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌పై పూర్తిస్థాయిలో వివరాలను తప్పించుకున్న జిల్లా ఎస్పీ మ‌నోహ‌ర్ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించుకోవడం వల్ల శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చ‌ర్చ‌కు అనుమ‌తి నిరాక‌రించారు.

జూన్ 26న‌ కొల్లాపూర్ పట్టణంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండడం గానీ, సభలు, సమావేశాలు నిర్వహించడం గానీ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లభించక పోవడంతో కొల్లాపూర్ అధికార పార్టీ నేతల కొట్లాటకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు.