Begin typing your search above and press return to search.

దిశ ఎన్ కౌంటర్: మేథావులకు ఒక సామాన్యుడి లేఖ

By:  Tupaki Desk   |   9 Dec 2019 1:30 AM GMT
దిశ ఎన్ కౌంటర్:  మేథావులకు ఒక సామాన్యుడి లేఖ
X
ఒక నిర్భయ.. ఒక దిశ.. ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు పదిమంది బాధితులు. కానీ ఆ నేరస్తులకు శిక్షలు పడవు!

దిశ ఎపిసోడ్ లో నిందితుల ఎన్ కౌంటర్ పై భారీగా చర్చలు సాగుతున్నాయి. సామాన్యులు.. చాలామంది సెలిబ్రిటీలు ఈ ఎన్ కౌంటర్ ను నిర్ద్వందంగా సమర్థిస్తున్నారు. సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా ఎన్ కౌంటర్ ను సమర్థించేవారు ఎవరూ నేర చరిత్ర ఉన్నవారు కాదు.. ఘోరాలు చేసేవారు అంతకన్నా కాదు. ఇదే 'న్యాయం' అన్ని కేసుల్లో జరుగుతుందన్న ఆశ వారికి లేదు. ఈ ఎన్ కౌంటర్ తో ఔటర్ రింగ్ రోడ్ లో అర్థ రాత్రి సింగిల్ గా ఒక అమ్మాయి తిరిగే స్వేచ్చ వస్తుందనే దురాశ అంతకన్నా లేదు.

ఇప్పుడు ఈ ఎన్ కౌంటర్ పై విమర్శలు చాలానే ఉన్నాయి. ఒకరు పోలీసు డిపార్ట్ మెంట్.. ప్రభుత్వం వైపు ఉన్న తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం.. జనాల కోపాన్ని చల్లార్చే ప్రయత్నమే ఈ ఎన్ కౌంటర్ అంటారు. మరొకరు నిందితుల్లో బడా బాబులు లేరు కాబట్టి ఎన్ కౌంటర్ జరిగింది అంటారు. మరొకరు లీగల్ ప్రాసెస్ ను షార్ట్ కట్ చేయకూడదంటారు. కొందరు రాజ్యాంగాన్ని అవపోసన పట్టిన మేథావులు పవిత్ర రాజ్యాంగంలోని ఆర్టికల్ 20.. ఆర్టికల్ 21 లో ఉండే ఫండమెంటల్ రైట్స్ గురించి ప్రస్తావించి మరీ ఎన్ కౌంటర్ ను చీల్చి చెండాడారు.

ఇక కొందరి వరస మరీ దారుణం. ఈ ఎన్ కౌంటర్ కు హర్షం వ్యక్తం చేయడం ఆటవికం అంట! ఇది మాబ్ మెంటాలిటీ అని.. అలాంటి కొన్ని పెద్ద పెద్ద పదాలను వాడి సాధారణ ప్రజల స్పందన 'మేథావులు ఎలాంటి స్పందన ఆశించారో అలాంటి స్పందన' లేనందుకు సాధారణ ప్రజల్ని చీల్చి చెండాడుతున్నారు..!

సరే ఇవన్నీ లాజిక్కులే. ఆల్ లాజిక్స్ హోల్డ్ గుడ్. కానీ సాధారణ జనాలు ఇవేవీ పట్టించుకోకుండా ఎందుకు ఎన్ కౌంటర్ కు జై కొట్టారు???????

ఇలా ఎందుకు జరిగిందో మనం కొన్ని అంశాలు పరిశీలిద్దాం.

మొదటి అంశం. మేథావులు ప్రతిసారి సాధారణ ప్రజల సహనాన్ని పరీక్షించే అంశం ఇదే. మానవ హక్కులు అసలు ఎవరికి ఉంటాయి? నేరస్తులకు.. సైకోలకు.. తీవ్రవాదులకు 'మాత్రమే' ఉంటాయా? ఇలాంటి క్రూర జంతువుల బారిన పడ్డ బాధితులకు.. బాధితుల కుటుంబీకులకు కూడా ఉంటాయా? అలా ఉంటే ఈ మనవ హక్కుల మేథావులు బాధితుల పక్షాన పోరాడాకుండా నేరస్తుల పక్షాన ఈ మేథావులు ఎందుకు నిలబడుతున్నారు?

రెండవ అంశం.. అసలు జనాలు ఇలాంటి ఎన్ కౌంటర్ ను ఎందుకు వేడుకలా జరుపుకున్నారు? ఇది వ్యవస్థ పట్ల సడలిపోయిన నమ్మకం కాదా? నేరం నిరూపితమైన నిర్భయ కేసు నిందితులు ఇంకా జీవించి ఉంటే ప్రజలలో అసహనం వ్యక్తం కాదా? నిర్భయ కేసులో తప్పించుకున్న'బాల'(మైనర్) రేపిస్టు సంగతి ఏంటి? అలాంటి నేరంలో పాల్గొన్న వాడు కులాసాగా బైట తిరుగుతూ ఉంటే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది?

మూడవ అంశం.. సరే.. ఈ ఎన్ కౌంటర్ తప్పే అనుకుందాం. నిందితులందరినీ ఎన్ కౌంటర్ చెయ్యలేరు. వారిని తర్వాత నేరస్తులుగా నిరూపించనూలేరు. మరేం చెయ్యాలో ఈ మేథావులు చెప్పాలి కదా? ఆ జవాబులు వీరి దగ్గర ఉన్నాయా? దీనికి జవాబులు వెతికే దిశగా ఈ సో కాల్డ్ మేథావులు చేస్తున్న ప్రయత్నం ఏంటి?

***
అసలు సమస్య న్యాయ వ్యవస్థలో ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో సడలిపోతోంది. చాలామందిలో ఆ నమ్మకం ఇప్పటికే లేదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి? న్యాయవ్యవస్థ సమూల ప్రక్షాళన.

ఈ సోషల్ మీడియా జెనరేషన్లో ఒక కేసు పదేళ్ళు.. ఇరవై ఏళ్ళు అని సాగదీయడం సరి కాదు. ఎప్పుడో ఒక కేసు విచారణ ఆలస్యం అయిందంటే సరే కానీ ప్రతి కేసుకు ఇంత సమయం ఎందుకు? దీనికి కారణాలు ఏంటి? కోర్టులు లేవు.. స్టాఫ్ లేరు.. జడ్జీలు లేరు.. లాయర్లు లేరు అంటారు.

అలా అయితే కోర్టుల సంఖ్య ఎందుకు పెంచకూడదు? జడ్జిల సంఖ్య ఎందుకు పెంచకూడదు? ఉద్యోగాలు లేక జనాలు ఖాళీగా తిరుగుతున్నారు కదా? న్యాయ వ్యవస్థలోనే ఉద్యోగాలు ఉంటే దీనికి సంబంధించిన చదువే చదువుతారు కదా? అయినా నేరాల సంఖ్యకు తగ్గట్టే కోర్టులు ఉండాలి కదా. అప్పుడే పెండింగ్ కేసుల సంఖ్య తగ్గేది. ఇలా ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఈ మేథావులు ఈ అంశాన్ని లేవనెత్తరు? ప్రభుత్వాన్ని ఈ విషయంపై ఎందుకు ప్రశ్నించరు.. ఎందుకు నిలదీయరు?

అయ్యా మేథావులూ.. కాకలు తీరిన రాజ్యాంగ కోవిదులూ.. మీ మేథావితనం ఇలాంటి విషయాలపై చూపించి పోలీసు వ్యవస్థ.. న్యాయ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేసేలా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చూడండి. బాధితులకు.. బాధితుల కుటుంబాలకు చట్ట ప్రకారమే.. భారతీయ రాజ్యాంగం ప్రకారమే సత్వర న్యాయం అందేలా చూడండి.

అప్పుడు ఇలాంటి ఎన్ కౌంటర్లకు సాధారణ ప్రజలు ఎవరూ చప్పట్లు కొట్టరు. కొట్టాల్సిన అవసరమే వారికి రాదు.. హాయిగా జబర్దస్త్ బూతు జోకులకు మొహమాటం లేకుండా నవ్వుతూ ఇంట్లో కూర్చుంటారు. ఎన్ కౌంటర్ సైట్ కు ప్రయాణం చేసి మరీ అక్కడ గులాబి రేకులు చల్లరు. అసలు సమస్య వదిలేసి నేరస్తుల తరఫున పోరాడుతూ ప్రజల మనసులకయ్యే గాయాలపై గుంటూరు ఎర్రకారం చల్లకండి!