తన మాట మీద నమ్మకం పోయేలా కేసీఆర్ చేసుకుంటున్నారా?

Sun Dec 05 2021 15:00:01 GMT+0530 (IST)

Comments made by KCR have now come up for discussion

వరాలు ఇవ్వటం.. వాటి అమలు గురించి లైట్ తీసుకోవటం పాలకులకు మామూలే. అయితే.. గతంలో ఇలాంటివి ఏదోలా చెల్లేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.గతంలో లేని సోషల్ మీడియా.. వాట్సాప్ తో పాటు ఇతర వేదికల కారణంగా.. రాజకీయ చైతన్యమే కాదు.. పాలకులు చేసిన తప్పుల్ని నిర్మోహమాటంగా నిలదీస్తున్న వైనం కనిపిస్తోంది. అర్భాటపు ప్రకటనలకు కేరాఫ్ అడ్రస్ గా.. ఎంతటి వరాన్ని అయినా సరే.. అరటి పండు ఒలిచి.. నోట్లో పెట్టినంత సులువుగా వరాలు ఇచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా అలాంటి పనే చేశారు హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో.ఆయన తెర మీదకు తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని.. హుజూరాబాద్ నియోజకవర్గంలో షురూ చేయటం తెలిసిందే. ఉప ఎన్నిక నేపథ్యంలో మధ్యలో ఆగిన ఈ పథకాన్ని.. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే షురూ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పటం తెలిసిందే. అలాంటి ఆయన మాటపై ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికను టార్గెట్ చేసుకొని మరీ దళితబంధు పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా వాదనలు వినిపించటమే కాదు.. ఇలాంటి తీరు ఏ మాత్రం మంచిది కాదన్నమాట వినిపించింది. అయితే.. ఈ తరహా విమర్శల్ని సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. ప్రజలకు మంచి పనులు చేయాలంటే.. లేనిపోని పెడార్థాలు తీస్తున్నారంటూ తనను విమర్శించే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. కేసీఆర్ కమిట్ మెంట్ ను శంకిస్తారా? మీకు పాపం ఖాయమంటూ గులాబీ నేతలు సైతం చెలరేగిపోయారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. అందులో కీలకమైనది.. ఉప ఎన్నిక ఫలితాలు వచ్చినంతనే దళిత బంధు అమలు చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు నవంబరు 2న వచ్చాయని.. నాలుగో తేదీ నుంచి తానే స్వయంగా పంపిణీ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

నవంబరు 4 వెళ్లి డిసెంబరు నాలుగు కూడా వచ్చిందని.. ఇప్పటికి సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీని మాత్రం అమల్లోకి తీసుకురాలేదన్న విమర్శ మొదలైంది. 'నవంబరు 4 పోయి.. డిసెంబర్ 4 వచ్చింది. సారు మాత్రం ఇంకా ఆ ముచ్చట తీయట్లేదు' అంటూ వాపోతున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే దళిత బంధు లబ్థిదారులు పెద్ద ఎత్తున ఉన్నారని.. వారందరికి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారన్నది ప్రశ్నగా మారింది. తాను ఇచ్చే హామీలు మాటలే కానీ చేతలకు కాదన్న విమర్శపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసే కేసీఆర్..ఇప్పుడు చేస్తున్నదేంటి? అన్నప్రశ్నను సంధిస్తున్నారు.