ఘాటు ఆరోపణ చేసి అడ్డంగా బుక్ అయ్యారే?

Tue Sep 14 2021 08:43:52 GMT+0530 (IST)

Comments On Ap opposition Parties

ఏదైనా విషయంలో ఒకరు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పు అవుతుందా? ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. చంద్రబాబు హయాంలో అనుసరించిన విధానంలో కనిపించని తప్పు.. జగన్ సర్కారు చేస్తే మాత్రం దాన్ని తప్పుగా అభివర్ణించటం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. బాబు సర్కారులో జరిగిన విషయాన్ని తప్పుగా చూడని కొన్ని మీడియా వర్గాలు.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని అడ్డదిడ్డంగా విమర్శలు చేయటం ఎంతవరకు సబబు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.ఇంతకూ విషయం ఏమంటే.. తాజాగా ఏపీ రాష్ట్ర సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ సమీర్ శర్మ నియామకానికి సంబంధించిన ఉత్తర్వు జారీ కావటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తప్పుల్ని ఎత్తి చూపటం.. పాలనాపరమైన అంశాల్లో అదే పనిగా పొరపాట్లు చేస్తుందన్న భావనను కలిగించే ప్రయత్నాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఇందుకు తగ్గట్లే కొత్త సీఎస్ నియామకంపై జారీ చేసిన ప్రకటననను తప్పుగా చూపించటమే కాదు.. రాష్ట్ర చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని కొన్ని మీడియాలలో రావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇద్దరు సీఎస్ లను నియమిస్తూ ఒకే జీవో జారీ చేసిన విషయాన్ని ఇప్పటి విమర్శకులు ఎలా మర్చిపోతారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అజేయ కల్లం ను సీఎస్ గా నియమిస్తూ జారీ చేసిన జీవో ఆయన పదవీ కాలం మరో నెల ఉండగానే తదుపరి సీఎస్ దినేశ్ కుమార్ అని ఎలా ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు గుర్తుకు రాని సంప్రదాయం.. గౌరవం ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని నిలదీస్తున్నారు. అది కూడా ఒకసారి కాకుండా రెండుసార్లు జరిగిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

2017 ఫిబ్రవరి 28 నాటికి నాటి సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో అజేయ కల్లంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లుగా జీవో జారీ చేశారు. అది కూడా నెల రోజుల ముందే విడుదల చేసినప్పుడు లేని తప్పు.. జగన్ సర్కారులోనే ఎందుకు కనిపిస్తోందన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ప్రభుత్వాన్ని ఏదోలా బద్నాం చేయటం కాకుంటే ఇంకేముందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి వేలెత్తి చూపించే వారు ఏమని సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.