ఈ కాంబినేషన్ వాడితే మహమ్మారి మటాష్

Sun Jul 05 2020 23:00:01 GMT+0530 (IST)

Combination For To Destroy new Dangerous Disease

ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారిరోగానికి వ్యాక్సిన్ లేదు. ఆ మాటకు వస్తే.. ఫలానా మందు అంటూ లేదు కూడా. మరి.. ఇన్ని కోట్లమందికి వైద్యం ఎలా చేస్తున్నారంటే? ఒక్కో రోగికి ఉండే రోగ లక్షణాల ఆధారంగా చేసుకొని మందులు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్న వారి విషయంలో వైద్యులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొందరు రోగులకైతే ఏ మందులు ఇచ్చినా తగ్గని పరిస్థితి కూడా ఉంది. అలాంటి వారి విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కాంబినేషన్ తో మహమ్మారికి షాకివ్వొచ్చని చెబుతున్నారు. అదేమంటే.. యాంటీవైరల్ మాత్ర రెమ్ డెసివిర్ తో పాటు మరికొన్ని రకాల మందుల్ని కలిపి వాడటం ద్వారా మెరుగైన ఫలితాలు పొందొచ్చని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. బారిసిటినిబ్ అనే మందును వాడితే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా దీన్ని రూమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు వాడుతుంటారు. ఈ మందుతో పాటు టోసిలీజుమాబ్ కూడా కలిసి వాడొచ్చని చెబుతున్నారు. రెమ్ డెసివిర్ తో పాటు మూడు.. నాలుగు రకాల మందుల్ని కలిపి వాడటం ద్వారా వైరస్ కు చెక్ పెట్టటమే కాదు.. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అదే సమయంలో జ్వరం కూడా తగ్గుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

మహమ్మారి బారిన పడిన రోగుల్ని కాపాడేందుకు కన్వాలెసెంట్ ప్లాస్మా పనికి వస్తుంది. ఈ ప్రయోగాన్ని ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీలో చేశారు. విజయం సాధించారు కూడా. ఈ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. దాన్ని మహమ్మారి బారిన పడిన వారికి ఇస్తారు. కామన్ స్టెరాయిడ్ డెక్సామెథసోన్ కూడా కరోనా మరణాల్ని మూడొంతుల వరకు ఆపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రెమ్ డెసివిర్ వాడకం బాగా పెరగటంతో త్వరలోనే దాన్ని ఇన్హేలర్ రూపంలో తేవాలని ఆలోచనలో ఉన్నారు. ఏమైనా..ఈ కాంబినేషన్లు అన్ని వైద్యులు వారికున్న అవగాహనతోనే వాడాలే తప్పించి.. ఎవరూ తమ సొంతంగా వాడకూడదన్నది మర్చిపోకూడదు.

TAGS: