Begin typing your search above and press return to search.

'కలర్ ఫుల్' నిజాలు.. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ సామర్థ్యం!

By:  Tupaki Desk   |   29 Jan 2022 11:30 PM GMT
కలర్ ఫుల్ నిజాలు.. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ సామర్థ్యం!
X
కలర్స్.. ఇవి లేకుంటే ప్రపంచం ఎంత డల్ గా ఉంటుందో కదా. నిజానికి రంగులు అనేవి మనిషి జీవితానికి చాలా ముఖ్యం. ప్రతీ ఒక్కరూ కలర్ ఫుల్ జీవితం కావాలని కోరుకుంటారు. వివిధ వర్ణాల రకరకాల గుణాలు కలిగి ఉంటాయి. కొన్ని రంగులు శాంతిని కలిగిస్తాయి. మరికొన్ని కోపాన్ని తగ్గిస్తాయి. ఇంకా కొన్ని ఆకలిని పెంచుతాయి. అందుకే కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో ప్రత్యేకమైన కలర్స్ వేస్తారు. అయితే ఈ రంగులు గుర్తించడంలో పురుషుల కంటే మహిళలే సిద్ధహస్తులంటా. రంగుల్లో షేడ్స్ ను మహిళలే చాలా స్పష్టంగా గుర్తించగలుగుతారని అమెరికాకు చెందిన బ్ల్రూక్లిన్ అనే సంస్థ వెల్లడించింది.

మహిళలు, పురుషులు రంగులు గుర్తించే సామర్థ్యంపై బ్ల్రూక్లిన్ సంస్థ అధ్యయనం చేపట్టింది. కాగా మన శరీరంలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ లో కలర్స్ గుర్తించడానికి సహకరిస్తుందని ఆ సంస్థ తేల్చింది. ఈ క్రోమోజోమ్ మహిళల్లో రెండు ఉంటే.. పురుషుల్లో ఒకటి మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాల హార్మోన్లు సైతం రంగులను గుర్తించడంలో సాయపడతాయని చెప్పారు. మహిళల్లో ఉండే టెస్టోస్టిరాన్ కూడా వర్ణాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వెల్లడించారు. అందుకే పురుషులతో పోల్చితే... మహిళలే ఎక్కువ రకాల రంగులను, వాటి మధ్య ఉన్న స్వల్ప తేడాలను కూడా గుర్తించగలుగుతామని వివరించారు.

ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే కలర్ బ్లూ అని ఈ ఫలితాల్లో తేలింది. దాదాపు 40 శాతం మందికి ఈ రంగు అంటే ఇష్టమటా.. ఆ తర్వాతి స్థానంలో పర్పుల్ కలర్ ఉంది. ఇకపోతే తర్వాతి స్థానాల్లో ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. ఆఖరి స్థానాల్లో తెలుపు, ఆరెంజ్, పసుపు రంగులు ఉన్నట్లుగా బ్ల్రూక్లిన్ సంస్థ సర్వేలో వెల్లడైంది. పింక్ కలర్ కు కోపాన్ని, ఆందోళన తగ్గించే గుణం ఉన్నందున వీటిని జైళ్లు, మానసిక చికిత్స ఆస్పత్రుల్లో ఉంచుతారని శాస్త్రవేత్తలు తెలిపారు.

వాహనాలకు సురక్షితమైన రంగు తెలుపు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మంచు తప్ప మిగిలిన ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెల్లని వాహనాలను సులభంగా గుర్తించవచ్చు అని అంటున్నారు. దీనితో పోల్చితే పసుపు రంగు ఇంకా స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఆ రంగులో వాహనాల సంఖ్య చాలా తక్కువ. అంతేకాకుండా ఎరువు, పసువు రంగు ఆకలిని పెంచుతాయట. అందుకే ప్రముఖ హోటళ్లు ఆ రంగుల్లో తమ బ్రాండ్లు ఉండేలా డిజైన్ చేసుకుంటారని బ్ల్రూక్లిన్ సంస్థ వెల్లడించింది.

ఈ విధంగా రంగుల ప్రపంచంలో కలర్ ఫుల్ నిజాలు దాగి ఉన్నాయి. ఒక్కో రంగు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అందుకే మన ప్రపంచం ఇంత సుందరంగా ఉంది. అయితే ఈ కలర్ ఫుల్ ప్రపంచాన్ని గుర్తించడంలో మహిళలకే ఎక్కువ సామర్థ్యం ఉందని బ్ల్రూక్లిన్ సంస్థ ఫలితాలు చెబుతున్నాయి.