పెళ్లి వేడుకలో కలెక్టర్ ఎగస్ట్రాలు.. ప్రభుత్వం కఠిన చర్యలు!

Tue May 04 2021 17:00:02 GMT+0530 (IST)

Collector extras In Marraige

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో సంచలనం సృష్టించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. అందులో పెళ్లి వేడుకలో ప్రవేశించిన కలెక్టర్ ఇతర అధికారులు నానా రచ్చ చేశారు. అడ్డొచ్చిన వారిని అరెస్టు చేయండని ఆదేశాలు జారీచేశారు. పెళ్లివస్తువులను కిందపడేశారు. చివరకు పెళ్లికొడుకును కూడా కొట్టారు! కొవిడ్ నేపథ్యంలో పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణం.ఇదంతా త్రిపుర రాష్ట్రంలో జరిగింది. ఆ కలెక్టర్ పేరు శైలేష్ కుమార్. వెస్ట్ త్రిపుర జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏప్రిల్ 26న ఆ జిల్లాలో రాత్రివేళ జరుగుతున్న పెళ్లి వేడుకలోకి ప్రవేశించిన ఆయన.. నానా రభస చేశారు. ఈ వ్యవహారం మొత్తం పలువురు సెల్ ఫోన్ల ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

అయితే.. ఈ పెళ్లికి అధికారుల అనుమతి కూడా ఉందన్నది గమనించాల్సిన అంశం. ముందస్తు పర్మిషన్ తో ఆ రాష్ట్రంలో వివాహాలు శుభకార్యాలకు అనుమతి ఇస్తున్నారు. ఈ పెళ్లి పెద్దలు కూడా దరఖాస్తు చేసుకొని పర్మిషన్ తీసుకున్నారని సమాచారం. అయినప్పటికీ.. కలెక్టర్ ఓవరాక్షన్ చేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో.. ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఆయన్ను విధుల నుంచి తప్పించినట్టు సమాచారం.

ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే.. దీనిపై సదరు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరినీ బాధపెట్టాలన్నది తన ఉద్దేశం కాదని ప్రజాప్రయోజనం కోసమే ఇలా చేశానని చెప్పుకొచ్చినట్టు సమాచారం.